Thursday, September 16, 2010

'బీఈడీ'లకు ఊరట ఎస్జీటీ పోస్టింగులలో వెసులుబాటు

ప్రైమరీ టీచర్ పోస్టులకు 2012 జనవరి 1 వరకూ అర్హత ప్రత్యేక నోటిఫికేషన్ జారీ చేసిన ఎన్‌సీటీఈ డీఎస్సీ-2008 నియామకాలపై ప్రభావం చూపేనా!
ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల అర్హతల గురించి జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌సీటీఈ) తాజాగా ఇచ్చిన ప్రత్యేక నోటిఫికేషన్ డీఎస్సీ-2008 నియామకాలకు పరిష్కార మార్గం చూపుతుందా? సుప్రీం కోర్టు ఈ నోటిఫికేషన్‌ను పరిగణనలోనికి తీసుకుంటుందా? ప్రస్తుతం సుప్రీంలో ఉన్న అర్హతల వివాదం సరికొత్త మలుపు తిరగనుందా? ఇలా గత కొద్ది రోజులుగా ఈ నోటిఫికేషన్‌పై నిరుద్యోగ ఉపాధ్యాయ వర్గాలు తర్జన భర్జన పడుతున్నాయి.
దీన్ని పరిగణనలోనికి తీసుకోవాలంటూ బీఈడీ అభ్యర్థులు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసేందుకు సన్నద్ధం అవుతుండడం గమనార్హం. విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ 23 సబ్ సెక్షన్ (1)కి అనుగుణంగా ఉపాధ్యాయుల విద్యార్హతల గురించి ఎన్‌సీటీఈ గత నెల 23న ప్రత్యేక నోటిఫికేషన్ (ఎఫ్.నం.61-03/20/010) విడుదల చేసింది. దీని ప్రకారం 5వ తరగతి వరకు బోధించే ఉపాధ్యాయులకు సీనియర్ సెకండరీ అంటే మన రా ష్ట్రంలో ఇంటర్మీడియట్‌తో పాటు ప్రాథమిక విద్యలో డిప్లొమా సర్టిఫికెట్ ఉండాలి.
6 నుంచి 8వ తరగతి వరకు బోధించే వారికి బీఏ/బీఎస్సీతో పాటు బీఈడీ అర్హతలు ఉండాలి. ఈ నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి 2012 జనవరి 1 వ తేదీ వరకు బీఏ/బీఎస్సీతో పాటు బీఈడీ అర్హతలు కలిగిన వారు ఎన్‌సీటీఈ నిర్వహించే ఆరు నెలల ప్రత్యేక శిక్షణ పొందితే, 1 నుంచి 5వ తరగతి వరకు ఉపాధ్యాయులుగా నియామకానికి అర్హులవుతారు. అయితే ఈ నోటిఫికేషన్ వెలువడే నాటికే రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ప్రారంభించిన రాష్ట్రాలు ఎన్‌సీటీఈ 2001 నిబంధనల ప్రకారమే ఆ నియామకాలు పూర్తి చేసుకోవచ్చని కూడా స్పష్టం చేసింది.
ఆ నిబంధనల ప్రకారం ప్రాథమిక పాఠశాలల్లోని టీచర్లుగా డీఈడీ అభ్యర్థులే అర్హులు. అయితే తాజా నోటిఫికేషన్‌లో 2012 వరకు బీఈడీ అభ్యర్థులకు కూడా ఎన్‌సీటీఈ అవకాశం కల్పించింది. దీంతో ఇప్పటికే ప్రకటించిన ఎంపిక జాబితాలోని అభ్యర్థులందరికీ ఈ నోటిఫికేషన్ ప్రకారం తక్షణమే నియామకాలు చేపట్టాలని ఏపీ బీఎడ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరుతోంది. కొత్త నిబంధనల ప్రకారం బీఈడీ చదివిన వారిని ఎస్‌జీటీలుగా నియమించేలా ఓ వెసులుబాటును కల్పించినట్లే చెప్పవచ్చు.
అయితే ఇప్పటికే ప్రాథమిక పాఠశాలల్లోని సెకండరీ గ్రేడ్ టీచర్ల అర్హతలకు సంబంధించి బీఈడీ/డీఈడీ అభ్యర్థుల నడుమ వివాదం నడుస్తుండటం, రాష్ట్ర ప్రభుత్వం గతంలో జారీ చేసిన ఉత్తర్వులు, కోర్టు తీర్పులపై వివరణ ఇచ్చినందున ప్రస్తుతానికి మౌనంగా ఉండటమే మేలని పాఠశాల విద్యాశాఖ భావిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి జారీ చేసిన నోటిఫికేషన్లు, జీ.ఓ.నెం 27, 28లు వివాదాస్పదం కావటమే ఇందుకు కారణమని సంబంధింత వర్గాలు పేర్కొంటున్నాయి.

No comments: