Tuesday, May 3, 2011

"కార్బన్ కాలి గుర్తు"ని తగ్గించుకోడానికి కొన్ని చిట్కాలు

1. ఇంట్లో ‘పవర్ ఫాక్టర్ ఆప్టిమైజర్’ ని ఇన్స్టాల్ చేసుకోండి. దీని వల్ల మోటార్ల పనికి అయ్యే ఖర్చు తగ్గుతుంది. వాటి ఆయుర్దాయం కూడా పెరుగుతుంది.
2. ఉతికిన బట్టలని డ్రయర్ లో కాక ఎండలో ఆరేయండి.
3. చల్లనీటిలో బట్టలు ఉతకండి. నీరు పిండిన బట్టలని ఆరుబయట ఆరేయండి. బయట ఎండగా ఉన్నా బట్టలని డ్రయర్ లో ఎండబెట్టకండి.

4. స్నానానికి వీలైనంతవరకు చన్నీళ్ళే వాడండి. ఆ విధంగా శక్తి, నీరు రెండూ ఆదా అవుతాయి.
5. ఇన్కాండెసెంట్ బల్బులని తొలగించి ‘కాంపాక్ట్ ఫ్లోరెసెంట్ లైట్ (CFL) బల్బ్’లని గాని, ‘లైట్ ఎమిటింగ్ డయోడ్ల’ని (LEDs) గాని వాడండి. ఒక్క ఇన్కాండెసెంట్ బల్బుని మార్చితే దాని జీవిత కాలంలో 150 పౌన్ల కార్బన్ ఆదా అవుతుంది. ఈ కొత్త రకం బల్బులు, ఇన్కాండెసెంట్ బల్బుల కన్నా 8-15 రెట్లు ఎక్కువ కాలం మన్నుతాయి, కనుక మొత్తం జీవితకాలంలో సుమారు Rs. 1500 ఆదా చేస్తాయి. అయితే CFL రకం బల్బులలో కాస్తంత పాదరసం ఉంటుంది. కనుక వాటిని పారేసేటప్పుడు ‘ప్రమాదకర వ్యర్థం’గా జమకట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి. LED లు కూడా చాలా సమర్థవంతంగా పని చేస్తాయి. ఇన్కాండెసెంట్ లైట్లకి మల్లె ఇవి కూడా మెత్తని తెల్లని కాంతిని వెలువరిస్తాయి. వాటిలో పాదరసం ఉండదు గాని అవి CFL బల్బుల కన్నా ఆరు రెట్లు ఎక్కువ కాలం మన్నుతాయి. దీని వల్ల విద్యుత్ చార్జీలు తగ్గుతాయి.
6. మైక్రోవేవ్ పరికరాలని మరింతగా వాడాలి. మామూలు గ్యాస్ పొయ్యిల కన్నా, ఓవెన్ ల కన్నా మైక్రోవేవ్ పొయ్యిలు మరింత తక్కువ శక్తిని వాడుతాయి. ముఖ్యంగా నీరు వేడి చేసినప్పుడు శక్తి ఆదా గణనీయంగా కనిపిస్తుంది.
7. ఇంట్లో లైట్ల అవసరం లేకపోతే అది కాసేపే అయినా కూడా లైట్లు ఆపేయండి.
8. నెలకి ఒకసారి అయినా ఏ.సీ. లలో ఫిల్టర్లని శుభ్రం చెయ్యండి, లేదా మార్చేయండి.
9. ఫ్రిడ్జిలో ఉష్ణోగ్రతని 36-38 డిగ్రీల వద్ద, లోపల ఫ్రీజర్ లో ఉష్ణోగ్రతని 0-5 డిగ్రీల వద్ద సెట్ చెయ్యండి. ఫ్రిడ్జ్ లో గాలి పరిమాణం అతి తక్కువగా ఉండేలా, నిండుగా వస్తువులని సర్దండి.
10. పళ్లు తోముకుంటున్నప్పుడు కొళాయి కట్టేయండి. దీని వల్ల నెలకి 25 గాలన్ల నీరు ఆదా అవుతుంది.
11. టాయిలెట్ లో వాడే ట్యాంకులో నీటి మోతాదు తగ్గించుకోండి. టాయిలెట్ టాంకులో నీరు నింపిన లీటర్ బాటిల్ పెడితే నెలకి 300 గాలన్ల నీరు ఆదా అవుతుంది.
12. స్నానానికి ప్రవాహం తక్కువగా ఉండే షవర్లని వాడండి. అలాగే కొళాయిలో ఎయిరేటర్లు (faucet aerators) వాడి నీరు ఆదా చెయ్యండి.
13. ఎండాకాలానికి, చలికాలానికి మధ్య ఇంట్లో వాడే సీలింగ్ ఫాన్ల రెక్కలని తిరగతిప్పండి.
14. వాడేసిన ఫర్నీచర్ కొనుక్కోండి. ఇవి కొత్త ఫర్నీచర్ కన్నా చవకగా ఉంటాయి. (పురతన ఫర్నీచర్ (antique furniture) ఇందుకు మినహాయింపు). పాత ఫర్నీచర్ ని పారేయకుండా వాడడం వల్ల వ్యర్థాలు తక్కువ అవుతాయి.
15. కాగితపు నాప్కిన్ల కన్నా బట్ట నాప్కిన్లు వాడండి. ఆ బట్టని శుభ్రం చెయ్యడానికి నీరు అవసరమైనా ఈ పద్ధతే మేలు.
16. ఇల్లు వదిలి వెళ్లేటప్పుడు ఎలక్ట్రానిక్ ఉపకరణాలని కేవలం ఆఫ్ చెయ్యడమే కాక ప్లగ్గు తీసేయండి. ఆఫ్ చేయబడి ఉన్న స్థితిలో కూడా ఈ పరికరాలు కొంత శక్తిని వాడుతాయి. సామాన్యంగా ఇళ్లలో 10% శక్తి వినియోగం ఈ విధంగా జరుగుతుంది.
17. ఒకే సారి ఎన్నో పరికరాల ప్లగ్గు తీసే సౌకర్యం కావాలంటే ‘సర్జ్ ప్రొటెక్టర్’ వాడండి.
18. వాడుకలో లేనప్పుడు కంప్యూటర్ని షట్ డవున్ చెయ్యండి.
19. పర్యావరణానికి మేలు చేసే కార్యక్రమాలని చేపట్టమని మీ స్థానిక అధికారులని ప్రోత్సహించండి.
20. శక్తిని సద్వినియోగం చేసే పద్ధతుల గురించి మీ స్నేహితులతో, ఇరుగుపపొరుగు వారితో, సహోద్యోగులతో పంచుకోండి.
21. అంగడికి వెళ్లినప్పుడు బట్టసంచీలని తీసుకెళ్లండి, ప్లాస్టిక్ సంచీలు, కాగితం సంచీలు వాడకండి.
22. సహజ పదార్థాల నుండి చేసిన ఉత్పత్తులని వాడండి.
23. దూరాల నుండి రవాణా చెయ్యబడ్డ సరుకుల కన్నా స్థానికంగా చెయ్యబడ్డ సరుకులనే వాడడానికి ప్రయత్నించండి
24. కాపీ చేసి, ప్రింట్ చేసే అవసరాలని తగ్గించుకోండి. తప్పనిసరిగా అవసరమైన పరిస్థితుల్లో కాగితానికి రెండు పక్కలా వాడండి.
25. కవర్లు, ఫోల్డర్లు, క్లిప్పులు మొదలైన వస్తువులని ఒకసారి వాడి పారేయకుండా పదే పదే వాడడానికి ప్రయత్నించండి.

No comments: