Friday, February 25, 2011

ఆవిరి యంత్రం

1700 లో సరిగ్గా అలాంటి ఆవిరి యంత్రాన్నే థామస్ సవేరీ (1650-1715) అనే ఓ ఇంగ్లీష్ ఇంజినీరు తయారుచేశాడు. అయితే దాని పని తీరు ప్రమాదకరంగా ఉండేది. ఆ యంత్రంలో అధిక పీడనం వద్ద ఆవిరిని వాడేవారు. అయితే ఆ రోజుల్లో అధికపీడనం వద్ద ఆవిరిని సురక్షితంగా నియంత్రంచడానికి తగ్గ సాంకేతిక పరిజ్ఞానం ఉండేది కాదు. తరువాత థామస్ న్యూకొమెన్ (1663-1729) అనే మరో ఇంగ్లీష్ వ్యక్తి సవేరీతో కలిసి పని చేస్తూ తక్కువ పీడనం వద్ద పని చెయ్యగల ఆవిరి యంత్రాన్ని తయారుచేశాడు (చిత్రం). ఆ యంత్రానికి పద్దెనిమిదవ శతాబ్దపు చివరి దశలో జేమ్స్ వాట్ (1736-1819) అనే స్కాటిష్ ఇంజినీరు మరిన్ని మెరుగులు దిద్ది, మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దాడు.

ఈ ఇలాంటి కృషి వల్ల చరిత్రలో మొట్టమొదటి సారిగా మనిషి కఠిన పరిశ్రమ కోసం తన కండబలం మీద, జంతువుల కండబలం మీద ఆధారపడాల్సిన పని లేకుండా పోయింది. గాలివాటంగా వచ్చి పోతుండే వాయుశక్తి తో ఇక తంటాలు పడనక్కర్లేదు. దొరకడమే అపురూపంగా ఉండే నీటి ప్రవాహాలని ఇక నమ్ముకోనక్కర్లేదు. ఇక ఇప్పుడు శక్తి ఎప్పుడు, ఎక్కడ కావాలన్నో కాసిన్ని బొగ్గులో, కట్టెలో కాల్చి, నీళ్లు మరిగించి, ఆ శక్తిని వినియోగించి వీలుగా పనిచేసుకోవచ్చు. ఈ అద్భుత ఆవిష్కరణే పారిశ్రామిక విప్లవానికి అంకురార్పణ చేసింది.

1650 నుండి నిప్పుకి అన్ని కొత్త ప్రయోజనాలు ఉండడం, అగ్ని శక్తితో భారమైన లౌకిక కార్యాలని సాధించగలగడం, మొదలైనవన్నీ చూసిన రసాయనికులకి నిప్పు ఓ కొత్త కోణం నుండి కనిపించసాగింది. అసలు నిప్పు అంటే ఏంటి? అన్ని వస్తువులూ ఎందుకు మండవు? అసలు జ్వలన క్రియలో ఏం జరుగుతుంది?

మండే వస్తువులలో “అగ్ని” లాంటి ఏదో ప్రత్యేక పదార్థం ఉంటుందని, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అది బహిర్గతం అవుతుందని ప్రాచీన గ్రీకులు నమ్మేవారు. రసవాదుల ఆలోచనలు కూడా కొంచెం ఆ విధంగానే ఉండేవి. మండే వస్తువుల్లో “సల్ఫర్” అనే పదార్థం ఉంటుందనేవారు వాళ్లు. అయితే ఆ “సల్ఫర్” కి ప్రస్తుతం మనకి తెలిసిన సల్ఫర్ కి సంబంధం లేదు.

No comments: