Thursday, November 18, 2010

రవి చంద్రులపై అనుకోని మచ్చలు

మొట్టమొదటి సారిగా చందమామ కేసి దూరదర్శినిని గురిపెట్టిన గెలీలియోకి ఆ అనుభవంతో తన జీవితమే కాక, విజ్ఞానం కూడా ఓ మలుపు తిరగబోతోందని తెలీదు. నవంబర్ 1609 లో గెలీలియో తన చంద్ర పరిశీలనలు మొదలెట్టాడు. అందుకు తను నిర్మించిన X20 దూరదర్శినిని వాడుకున్నాడు. నవంబర్ 30 నుండి డిసెంబర్ 18 వరకు రోజు క్రమబద్ధంగా పరిశీలనలు చేసి ఆ వివరాలన్నీ ’సైడీరియస్ నున్సియస్ (Sidereus Nucius) అనే పుస్తకంలో పొందుపరిచాడు. చందమామ ఉపరితలం అంతా “పెద్ద పెద్ద కొండలతోను, లోతైన అగాధాలతోను, మెలికలు తిరిగే దారులతోను నిండి ఉండడం” చూసి నిర్ఘాంతపోయాడు. చందమామ మీద వెలుగు ఉన్న చోట (అక్కడి పగలు) ఎన్నో నల్లని మచ్చలు కనిపించాయి. అలాగే చీకట్లో ఎన్నో మెరిసే భాగాలు కనిపించాయి. అలాగే వెలుగు, చీకట్లని వేరు చేసే సరిహద్దు నునుపుగా లేదని, సూక్ష్మంగా చూస్తే ఆ రేఖ గజిబిజిగా ఉందని కూడా గమనించాడు.


ఈ పరిశీలనలన్నీ చందమామ గురించిన గత భావాలకు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి. గెలీలియో పూర్వీకులు టోలెమీ (Ptolemy) తదితరులు “దివి వస్తువులు” (heavenly bodies) అన్నీ మచ్చ లేని పరిపూర్ణ గోళాలని బోధించారు. నిమ్నోన్నతలు, వాగులు ’వంక’లు అన్నీ భూమికే. భూమి కాని ఇతర ఖగోళ వస్తువులన్నీ మచ్చలేని గోళాకృతిలో రోదసిలో సనాతన సంచారం చేస్తుంటాయి. కాని గెలీలియోకి కనిపించిన చందమామ అలా లేదు.

భూమి మీద ఉన్నట్టే చందమామ మీద కూడా కొండలు, లోయలు కనిపించాయి. ఆ కొండల మీద, లోయల లోను సూర్య కాంతి వాలుగా పడ్డప్పుడు ఏర్పడే నీడలే ఆ మచ్చలు. సూర్యుడి బట్టి చంద్రుడి స్థానం మారుతున్నప్పుడు ఆ మచ్చల/నీడల రూపురేఖలు కూడా మారుతాయి. మరి చందమామ దివి వస్తువు అయితే, దాని మీద ఇన్ని అపరిపూర్ణతలు ఎలా ఉన్నాయి? చందమామకి, భూమికి తాహతులో మౌలికమైన తేడా యేముంది? మరి ఇతర ’దివివస్తువులు’ కూడా ఇలాగే అపరిపూర్ణంగా ఉండవని నమ్మకం ఏంటి?

ఆ విషయాన్ని తేల్చుకోడానికి గెలీలియో తన దూరదర్శినిని ఈ సారి సూర్యుడి మీదకి గురిపెట్టాడు. లోకం మీద కాంతులు కురిపించే భానుమూర్తి, అదిత్యుడు, మార్తాండుడు పరిపూర్ణుడో కాదో పరీక్షించాలి. సూర్యుడి మీద కూడా ’మచ్చలు’ ఉండడం చూసి గెలీలియో నిర్ఘాంతపోయాడు. ఇవి ’సూర్యబిందువులు (sunspots) అని, పరిసర ప్రాంతాల కన్నా వీటి వద్ద ఉష్ణోగ్రత కాస్త తక్కువగా ఉండడం వల్ల అలా కనిపిస్తాయని, వాటి వ్యాసం సగటున లక్ష కిలోమీటర్లు ఉంటుందని మనకిప్పుడు తెలుసు. పైగా ఆ ’మచ్చలు’ నెమ్మదిగా కదులుతున్నాయని కూడా గెలీలియో గమనించాడు. అంటే సూర్యగోళం తన అక్షం మీద అది పరిభ్రమిస్తోంది అన్నమాట. సూర్యుడికే ఆత్మభ్రమణం ఉన్నప్పుడు, భూమికి కూడా ఉండడంలో తప్పేముంది? కనుక కోపర్నికస్ చెప్పింది నిజమే అయ్యుంటుంది అని ఊహించాడు గెలీలియో.

జనవరి 1610 లో గెలీలియో దృష్టి బృహస్పతి మీద పడింది. గ్రహాలలో కెల్లా పెద్ద గ్రహం బృహాస్పతి. దూరదర్శినిలో చూస్తే ఎలా ఉంటుందో? బృహస్పతి దరిదాపుల్లో నాలుగు మెరిసే చుక్కలు కనిపించాయి. కనుక మొదట్లో అవి తారలు అనుకున్నాడు. వాటిని మెడీసియా సైడీరియా (Medicea Siderea – Medician Stars) అని పిలుచుకున్నాడు. గెలీలియో ఆ పేరు ఎంచుకోవడం వెనుక ఓ చిన్న కథ ఉంది.


పొట్టకూటి కోసం గెలీలియో గొప్పింటి వాళ్లకి లెక్కలు, సైన్సు ట్యూషన్లు చెప్పుకుని బతికేవాడు. అలా ట్యూషన్లు చెప్పించుకున్న వారిలో ఒకడైనా కాసిమో ద’ మెడీసీ అన్న వాడు తదనంతరం 1609 లో ఇటలీలో టస్కనీ ప్రాంతానికి డ్యూక్ అయ్యాడు. 1610 లో తను కనుక్కున్న ఈ కొత్త ఖగోళ విశేషాలని ఆ కాసిమో పేరు పెట్టాలని అనుకున్నాడు. ఆ విధంగా అతడి కృపాకటాక్షాలకి పాత్రుడు కావచ్చు ననుకున్నాడు.

గెలీలియో జీవితంలో ఆ మహామేధావి ఈ విధంగా ధనికుల, మతాధికారుల మోచేతి నీళ్లు తాగడం ఎన్నో సందర్భాలలో కనిపిస్తుంది. ఒక పక్క విజ్ఞాన రంగంలో అంత గొప్ప విప్లవాలు తీసుకువచ్చిన ఆ మేధావి, సంఘంలో పెద్ద మనుషుల అడుగులకి మడుగులొత్తడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అంత గొప్పవాడికి అలాంటి ప్రవర్తన తగదేమో ననిపిస్తుంది. కాని అప్పటి సాంఘిక పరిస్థితులు ఆలోచిస్తే ఒక విధంగా అది తప్పదేమో నని కూడా అర్థమవుతుంది.

గెలీలియో కాలానికి యూరప్ లో సాంస్కృతిక పునరుజ్జీవనం (Renaissance) మొదలై కొన్ని శతాబ్దాలు అయ్యింది. కాని అది కేవలం సాంకృతిక విప్లవం మాత్రమే. మనోరంగంలో వైజ్ఞానిక పునరుజ్జీవనం తెచ్చిన విప్లవానికి కోపర్నికస్ తదితరులు నాంది పలికినా, ఆ నూతన భావాలని నాటి సంఘం, మతం తీవ్రంగా నిరోధిస్తూనే ఉంది. సంఘం మెచ్చని, మతం అంగీకరించని భావాలని ధీమాగా వ్యక్తం చేస్తే ప్రాణానికే ముప్పు. అలాంటి సమాజంలో మేధావికి కూడా ధనికవర్గానికి, మతాధికారులకి ’బాంచను దొరా’ అనక తప్పదేమో. ఖగోళ వస్తువులకి చిన్న చితక రాజుల పేర్లు పెట్టక తప్పదేమో. అందుకే ముందు కేసిమో పేరు మీద బృహస్పతి దరిదాపుల్లో కనిపించిన ఈ “చుక్కలకి” సమిష్టిగా ’కాసిమో సైడీరియే’ (Cosimo stars) అని పేరు పెడదాం అనుకున్నాడు. కాని అలా కాకుండా కాసిమో ఇంటి పేరైన ’మెడీసీ’ పేరు పెడితే, అతడి వంశానికే ఖ్యాతి తెచ్చినట్టవుతుందని అలా పేరు పెట్టాడు.

కాని తను నక్షత్రాలు అని నమ్మిన ఈ కొత్త వస్తువులని కొంత కాలం పాటు జాగ్రత్తగా గమనిస్తే ఆ “చుక్కలు” బృహస్పతి వెనక్కు పోవడం, తిరిగి గ్రహం ముందుకు రావడం కనిపించింది. అంటే అవి నక్షత్రాలు కావన్నమాట. అవి బృహస్పతికి చెందిన చందమామలు! భూమికి తప్ప ఇతర గ్రహాలకి చందమాలు ఉండడం అంతవరకు ఎవరూ చూడలేదు. అసలు ఇతర గ్రహాలకి చందమామలు ఉండొచ్చునన్న ఆలోచన కూడా ఎవరికీ రాలేదు. బృహస్పతి చుట్టూ చందమామలు తిరుగుతున్నాయన్న వాస్తవం టోలెమీ సిద్ధాంతాలకి గొడ్డలిపెట్టు అయ్యింది. విశ్వానికి కేంద్రం భూమి అయినప్పుడు, ఖగోళ వస్తువులన్నీ భూమి చుట్టూ పరిభ్రమిస్తాయని నమ్మాల్సి ఉంటుంది. అలాంటి నేపథ్యంలో మరో గ్రహం చుట్టూ ప్రత్యేకంగా పరిభ్రమించే వస్తవులు ఉండడం మరొక్కసారి టోలెమీ భవాలని బలహీనపరుస్తూ, కోపర్నికస్ బోధించిన విశ్వదర్శనాన్ని సమర్థిస్తోంది.

No comments: