Thursday, November 18, 2010

భువి నుండి దివి కేసి సారించబడ్డ దూరదర్శిని

గెలీలియో వస్తువుల చలనం గురించి ఎన్నో మౌలిక విషయాలని కనుక్కున్నా, తను సాధించిన అతి ముఖ్యమైన విప్లవం అతడి చేతికి ఓ దూరదర్శిని చిక్కడంతో మొదలయ్యింది.

దూరదర్శినిని కనిపెట్టింది గెలీలియోయే అనుకుంటారు చాలా మంది. కాని ఆ పరికరాన్ని కనిపెట్టింది హోలాండ్ కి చెందిన హన్స్ లిపర్షే అనే వ్యక్తి. కళ్లద్దాలు తయారు చేసే ఈ వ్యక్తి, అక్టోబర్ 1608 లో దూరదర్శినిని కనిపెట్టాడు. కటకాలని (lenses) వాడి దృశ్యాన్ని వృద్ధి చేసే ప్రక్రియ చాలా కాలంగా తెలిసినదే. భూతద్దాలని చదవడానికి వాడే పద్ధతి కూడా చాలా కాలంగా ఉంది.. కటకాలని ఒక చట్రంలో బిగించి కళ్లద్దాలని చేసే పద్ధతి కూడా పదిహేనవ శతాబ్దపు ఇటలీలో ఉండేది. దూరదృష్టికి ఎలాంటి కటకాలు వాడాలో, హ్రస్వదృష్టి (short sight) కి ఎలాంటి కటకాలు వాడాలో కూడా తెలిసేది.


కాని ఇలాంటి పలు కటకాలని ఒక నాళంలో వరుస క్రమంలో అమర్చి, ఒక్క కటకంతో సాధించగల వృద్ధి (magnification) కన్నా ఎక్కువ వృద్ధిని సాధించొచ్చని ఇంగ్లండ్ లో 1570 లలో థామస్ మరియు లియొనార్డ్ డిగ్గిస్ అనే ఇద్దరు వ్యక్తులు నిరూపించారు. ఇందులో ఓ పుటాకార కటకం (convex lens), ఓ అద్దం వాడడం జరిగింది. ఇదో ప్రాథమిక దూరదర్శిని అనుకోవచ్చు. అయితే ఇది కేవలం ఓ పరిశోధనాత్మక దూరదర్శినిగానే ఉండిపోయింది. అధిక స్థాయిలో దీని ఉత్పత్తి జరగలేదు. ఆ తరువాత హన్స్ లిపర్షే చేసిన దూరదర్శినిలో ఒక పుటాకార కటకం, ఓ నతాకార కటకం (concave lens) వాడబడ్డాయి. అది దృశ్యాన్ని మూడు (X3), నాలుగు (X4) రెట్లు పెద్దది చేసి చూపిస్తుంది. హాలండ్ ప్రభుత్వం ఈ ఆవిష్కరణకి పేటెంట్ కూడా ప్రదానం చేసింది.

దూరదర్శినికి సంబంధించిన వార్త కొద్ది నెలలలోనే ఇటలీ తదితర ప్రాంతాలకి పాకింది. త్వరలోనే ఆ పరికరాలు యూరప్ లో పలు ప్రాంతాల్లో అమ్మకానికి వచ్చాయి. ఆగస్ట్ 1609 లోనే థామస్ హారియోట్ అనే వ్యక్తి ఓ X6 బలం ఉన్న దూరదర్శినితో చందమామని చూసినట్టు కూడా సమాచారం ఉంది. కాబట్టి దూరదర్శినితో ఖగోళ వస్తువులని చూసిన ప్రథముడు గెలీలియో కాడు. గెలీలియో గొప్పదనం తను చూసిన దాని నుండి అంతకు ముందు మరెవ్వరూ తెలుసుకోలేనంత గొప్ప సారాంశాన్ని రాబట్టడం.

లిపర్షీ నిర్మించిన దూరదర్శినిని కొనుక్కు తెచ్చుకున్నాడు గెలీలియో. దాని నిర్మాణాన్ని, పని తీరుని జాగ్రత్తగా అధ్యయనం చేశాడు. అంతకన్నా శక్తివంతమైన దూరదర్శినిని తయారుచెయ్యాలని నిశ్చయించుకున్నాడు. ఆగస్టు 1609 లో గెలీలియో ఆ రోజుల్లో అత్యంత శక్తివంతమైన దూరదర్శినిని తయారుచేసి, దాన్ని వెనీస్ నగరానికి చెందిన ’డోజ్’ కి బహుమతిగా ఇచ్చాడు. ఇద్దరూ కలిసి వెనీస్ లో ఉన్న ప్రఖ్యాత సెయింట్ మార్క్ గంట గోపురం (St. Mark bell tower) ఎక్కి పక్కనే ఉన్న చెరువుని, పరిసర ప్రాంతాలని తీరిగ్గా పరిశీలించారు. ఆ వ్యవహారం గురించి ఓ వారం తరువాత గెలీలియో తన మరిదికి జాబు రాస్తూ, తన దూరదర్శిని అందరినీ ’తెగ మురిపిస్తోంది’ అంటూ మురిసిపోతాడు. దానికి ముఖ్య కారణం తను చేసిన దూరదర్శిని యొక్క సంవర్ధక శక్తే. ఆ రోజుల్లో అత్యంత శక్తివంతమైన దూరదర్శిని యొక్క శక్తి X10 అయితే, గెలీలియో నిర్మించిన పరికరం యొక్క శక్తి X60 !

ఈ కొత్త పరికరంతో ఖగోళ పరిశోధనల మాట పక్కన పెట్టినా, దీనికి ఎన్నో భద్రతా ప్రయోజనాలు ఉన్నాయని త్వరలోనే స్పష్టమయ్యింది. చాలా దూరం నుండే ఇప్పుడు శత్రువుల రాకని కనిపెట్టొచ్చు. పైగా మనం కనిపెట్టినట్టు శత్రువుకి తెలిసే అవకాశం కూడా లేదు. అలాగే ఈ పరికరం వల్ల కొన్ని వాణిజ్య సంబంధమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయని కొందరు చురుకైన వ్యాపరస్థులు త్వరలోనే పసిగట్టారు. సముద్రం మీద అల్లంత దూరంలో బట్టలు, సుగంధ ద్రవ్యాలు మొదలైన సామగ్రిని మోసుకొస్తున్న ఓడలు కనిపించగానే, తీరం మీద ఉన్న వ్యాపారులు తమ సరుకులని సరసమైన ధరలకి వేగంగా అమ్మేసేవారు. లేకుంటే కొత్త సరుకు ఊళ్ళోకి ప్రవేశించిందంటే ధరలు అమాంతం పడిపోయే ప్రమాదం ఉంది.


ఆ విధంగా గెలీలియో నిర్మించిన ఈ శక్తివంతమైన దూరదర్శిని వల్ల ఎన్నో లౌకిక ప్రయోజనాలు ఉన్నట్టు తెలిసినా, దాని వల్ల ఎన్నో లోకోత్తర ప్రయోజనాలు ఉన్నాయన్న గుర్తింపుతో దాని విలువ ద్విగుణీకృతమయ్యింది. అంతవరకు కొండలని, బండలని, చెరువులని, తరువులని, పడవలని, పడతులని వీలైనంత దగ్గరగా చూసి ఆనందించడానికి మాత్రమే ఉపయోగించబడ్డ దూరదర్శినిని, గెలీలియో భువి నుండి మరల్చి దివి కేసి గురిపెట్టాడు.

కోట్ల క్రొంగొత్త సత్యాలతో తొణికిసలాడుతున్న విశ్వం గెలీలియో కళ్ల ఎదుట సాక్షాత్కరించింది.

No comments: