Wednesday, January 19, 2011

పరుసవేదానికి అవసానదశ

ముద్రణ వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. అంతకు పూర్వం పెద్దగా పేరులేని పుస్తకాల ప్రతులు తయారుచెయ్యడానికి ఎవరూ ముందుకు వచ్చేవారు కారు. కాని ముద్రణ వచ్చిన తరువాత పెద్ద ప్రాముఖ్యత లేని పుస్తకాలని కూడా సులభంగా అచ్చు వెయ్యడానికి వీలయ్యింది. ఆ కారణం చేతనే లుక్రెటియస్ రాసిన కావ్యం అచ్చయ్యింది. అందుచేతనే పరమాణు సిద్ధాంతానికి యూరప్ లో మంచి ప్రాచుర్యం లభించింది.


1543 లో రెండు విప్లవాత్మక గ్రంథాలు వెలువడ్డాయి. ముద్రణ తెలియని కాలంలో అయితే ఇలాంటి పుస్తకాలని ఛాందసులు కొట్టిపారేసేవాళ్లు. కాని ముద్రణ పుణ్యమా అని ఇలాంటి పుస్తకాలు కూడా ఎంతో ప్రాచుర్యానికి నోచుకున్నాయి. వాటిలో ఒకటి పోలిష్ ఖగోళశాస్త్రవేత్త నికొలాస్ కోపర్నికస్ (1473-1543) రాసిన పుస్తకం. ప్రాచీన గ్రీకు ఖగోళవేత్తలు విశ్వానికి భూమి కేంద్రం అని భావించేవారు. కాని అందుకు భిన్నంగా కోపర్నికస్ సూర్యుడే విశ్వానికి కేంద్రం అని బోధించాడు. ఇక రెండవ పుస్తకం ఫ్లెమిష్ జీవనిర్మాణ శాస్త్రవేత్త (anatomist) ఆంద్రియాస్ వెసేలియస్ (1514-1564) రాసింది. గతంలో ఎన్నడూ జరగనంత సవివరంగా, కచ్చితంగా మానవ శరీర నిర్మాణం అందులో అద్భుతంగా వర్ణించబడింది. ఈ రంగంలో ప్రాచీన గ్రీకుల భావజాలంలో ఉండే ఎన్నో దోషాలని ఈ పుస్తకం సవాలు చేసి, సరిదిద్దింది.

ఆ విధంగా ఏకకాలంలో ప్రాచీన గ్రీకుల ఖగోళశాస్త్రానికి, జీవశాస్త్రానికి కరిగిన పదవీచ్యుతే ఆధునిక “వైజ్ఞానిక విప్లవాని”కి శ్రీకారం చుట్టింది. (అయితే కొన్ని కొన్ని వర్గాలలో మాత్రం గ్రీకుల ఛాందస భావాలు మరో శతాబ్దం పాటు చలామణి అయ్యాయి.) ఈ విప్లవం పరుసవేదుల లోకాన్ని కాస్త నెమ్మదిగానే ప్రభావితం చేసింది. అయితే ఖనిజ, వైద్య రంగాల్లో మాత్రం విప్లవం యొక్క ముద్ర బలంగా పడిందనే చెప్పాలి.


పరుసవేదానికి అవసానదశ
ఆ కాలానికి చెందిన ఇద్దరు వైద్యుల కృషి వల్ల విజ్ఞానం కొత్త ఊపిరి పోసుకుంది. వారిలో ఒకడైన జార్జ్ బాయర్ (1494-1555) అన్నవాడు జర్మన్ దేశస్థుడు. రెండవవాడైన థియోఫ్రాస్టస్ బొంబాస్టస్ ఫాన్ హోహెన్మైమ్ (1493-1541) అన్నవాడు స్విట్జర్లాండ్ కి చెందినవాడు.

బాయర్ కి అగ్రికోలా అని మరో వ్యవహార నామం కూడా ఉంది. అగ్రికోలా అంటే లాటిన్ లో రైతు అని అర్థం (బాయర్ అంటే జర్మన్ లోనూ అదే అర్థం). ఖనిజాలకి ఔషధాలకి సంబంధం ఉండడం వల్ల అగ్రికోలా యొక్క ధ్యాస ఖనిజవిజ్ఞానం మీదకి మళ్లింది. అసలు ఖనిజాలకి ఔషధాలకి మధ్య సంబంధం బలపడడం, వైద్యుడే ఖనిజవేత్తగా చలామణి కావడం అనేది రసాయన శాస్త్ర చరిత్రలో మరో రెండున్నర శతాబ్దాల పాటు ఓ విశేషంగా పరిణమించింది. అగ్రికోలా రాసిన “De Re Metallica” (లోహవిజ్ఞానం) అన్న పుస్తకం 1556 లో ప్రచురించబడింది. అంతవరకు లోహకారులకి తెలిసిన ఆచరణాత్మక జ్ఞానాన్ని, గనులకి సంబంధించిన జ్ఞానాన్ని అంతటిని అందులో పొందుపరిచాడు.

సుస్పష్టమైన శైలిలో రాయబడ్డ ఆ పుస్తకంలో గనులలో వాడే యంత్రాంగానికి సంబంధించిన చిత్రాలెన్నో ఉన్నాయి. త్వరలోనే ఆ పుస్తకానికి గొప్ప పేరొచ్చింది. వైజ్ఞానిక సాహితీ చరిత్రలో ఓ గొప్ప స్థానాన్ని ఆక్రమించింది.

No comments: