Friday, January 28, 2011

ఆంద్రియాస్ లిబావ్ - జర్మన్ పరుసవేది

ఉదాహరణకి 1597 లో ఆంద్రియాస్ లిబావ్ అనే జర్మన్ పరుసవేది (ఇతడికి లిబావియస్ అనే లాటిన్ పేరు కూడా ఉంది) ఆల్కెమియా అనే పుస్తకం రాశాడు. గతంలో పోగైన పరుసవేద సారం మొత్తాన్ని ఆ పుస్తకంలో పొందుపరిచాడు. రసాయన శాస్త్రంలో అది మొట్టమొదటి పాఠ్యగ్రంథం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అందులో ఎలాంటి తత్వజ్ఞానాన్ని జోడించకుండా శుద్ధ వైజ్ఞానిక పరిభాషనే వాడాడు. పైగా పారాసెల్సస్ అనుయాయులు ప్రచారం చేసిన పాత, బూజుపట్టిన భావాల మీద దుమ్మెత్తి పోశాడు. అయితే పరుసవేదం యొక్క ముఖ్యలక్ష్యం బంగారం తయారుచెయ్యడం కాదని, వైద్య చికిత్సకి చేదోడువాదోడుగా ఉండడం అనే నమ్మకంలో ఇతడు పారాసెల్సస్ లో ఏకీభవించాడు.


హైడ్రోక్లోరిక్ ఆసిడ్, టిన్ టెట్రాక్లోరైడ్, అమోనియమ్ సల్ఫేట్ మొదలైన రసాయనాల తయారీని మొట్టమొదట వర్ణించిన వాడు ఈ లిబావియస్. అక్వారెజియా (“రాచనీరు”) తయారీని కూడా ఇతడు వర్ణించాడు. నైట్రిక్ ఆసిడ్, హైడ్రోక్లోరిక్ ఆసిడ్ ల మిశ్రమం అయిన ఈ ద్రావకం బంగారాన్ని కూడా కరిగించగలదు. అందుకే దానికా పేరు. ఒక ద్రావకం ఆవిరి అయినప్పుడు మిగిలే స్ఫటికాల (crystals) ఆకారాల బట్టి ఖనిజాలని వర్గీకరించొచ్చని కూడా ఇతడు భావించాడు.

అయితే లోహాల రూపాంతరీకరణ సాధ్యమేనని ఇతడు నమ్మేవాడు. కనుక బంగారం యొక్క తయారీకి సంబంధించిన రసాయనిక పద్ధతుల రూపకల్పన ఓ ముఖ్యమైన రసాయనిక లక్ష్యంగా భావించేవాడు.

1604 లో యోహాన్ థోల్డె అనే జర్మన్ ప్రచురణ కర్త మరింత సవిరమైన, ప్రత్యేకమైన పుస్తకాన్ని ప్రచురించాడు. (ఈ పుస్తక రచయిత అని తప్ప ఈ వ్యక్తి గురించి మరే ఇతర వివరాలు లేవు). ఈ పుస్తకాన్ని రాసింది బాసిల్ వాలెంటీన్ అనే సాధువు అని చెప్పుకున్నాడు ఆ ప్రచురణ కర్త. అయితే ఆ కలంపేరుతో ప్రచురణకర్తే ఆ పుస్తకాన్ని రాసి ఉండే ఆస్కారం కూడా ఉంది. “ఆంటిమనీ రథపు జైత్రయాత్ర (The triumphal Chariot of Antimony) అని పేరు గల ఈ పుస్తకంలో ఆంటిమనీ యొక్క వైద్య ప్రయోజనాల గురించి, దాని సంయోగాల (compounds) గురించి చెప్పబడింది.

ఆ తరువాత వచ్చిన యోహాన్ రడోల్ఫ్ గ్లౌబర్ (1604-1668) అనే జర్మన్ రసాయనికుడు సల్ఫరిక్ ఆసిడ్ కి, మామూలు ఉప్పుకి మధ్య జరిగే చర్య సహాయంతో హైడ్రోక్లోరిక్ ఆసిడ్ పుట్టించే పద్ధతిని కనుక్కున్నాడు. ఈ పద్ధతిలో హైడ్రోక్లోరిక్ ఆసిడ్ తో పాటు సోడియమ్ సల్ఫేట్ అవశేషంగా మిగులుతుంది. దీన్నే నేటికీ మనం “గ్లౌబర్ సాల్ట్” అంటాం.
గ్లౌబర్ తను కనుక్కున్న ఈ కొత్త పదార్థాన్ని లోతుగా శోధించాడు. దాని విరేచనకారక (laxative) లక్షణాలని గుర్తించాడు. దానికి “సాల్ మిరాబీల్” (అద్భుత లవణం) అని పేరు పెట్టాడు. అది సర్వరోగనివారిణి అని, అమృతతుల్యమైన పదార్థమని చాటేవాడు. ఈ పదార్థంతో పాటి ఔషధ లక్షణాలు గల మరి కొన్ని పదార్థాలని కూడా భారీ ఎత్తున ఉత్పత్తి చేసే వ్యాపారంలోకి దిగాడు. ఆ విధంగా బాగా సంపాదించాడు. బంగారం ఉత్పత్తి కన్నా ఇది మరింత ఐహికమైన, వాస్తవికమైన వ్యాపకం కావడమే కాక, మరింత లాభదాయకం కూడా.

No comments: