Sunday, July 4, 2010

“స్వయం కితకితలు” ఎందుకు పని చెయ్యవు?

నాడీమండలం చేసే ఎన్నో క్రియలకి ప్రయోజనాలు వెతుక్కోవచ్చు. ఆహారాన్వేషణ అనో, ప్రమాదాల నుండి ఆత్మరక్షణార్థం అనో ఎన్నో రకాల స్పందనల వెనుక మూలకారణాన్ని ఊహించవచ్చు. కాని నవ్వు అన్న అంశానికి అలాంటి కారణం ఆలోచించడం కష్టం. సర్జరీలు, ఎలక్ట్రోడ్ లు మొదలైన హంగామా ఏమీ లేకుండా సులభంగా నవ్వు పుట్టించ గల మరో పద్ధతి ఉంది - అదే గిలిగింత.


చక్కిలిగింత అనేది స్పర్శేంద్రియానికి సంబంధించినది. శరీరం మీద అక్కడక్కడ సున్నితంగా తాకినప్పుడు కలిగే అనుభూతి ఇది, ఆపుకోలేని నవ్వొస్తుంది. ముఖ్యంగా మెడ వెనుక, నడుము పక్కల్లో తాకినప్పుడు చాలా మందికి చక్కలిగింత పుడుతుంది. పెద్ద వాళ్లలో కన్నా చిన్న పిల్లల్లో గిలిగింతకి స్పందించే గుణం మరింత బలంగా ఉంటుంది.

స్పర్శలో ఎన్నో రకాలు. చర్మాన్ని పై పైన తాకే తేలికైన స్పర్శ (light touch), చర్మాన్ని గట్టిగా వత్తే స్పర్శ (deep pressure), స్థిరమైన స్పర్శ (sustained touch), కంపనతో కూడిన స్పర్శ (vibration) ఇలా స్పర్శలో తేడాలని వర్గీకరించవచ్చు. అయితే ప్రత్యేకించి ఇలా వర్గీకరించడానికి కారణం ఒకటుంది. అసలు మనకి స్పర్శ కలిగించే సాధనాలు మన చర్మంలో ఉండే cutaneous receptors అనే స్పర్శాంగాలు. వీటిలో ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన స్పర్శకి స్పందిస్తుంది. స్పర్శలో తేలికగా ఉంటూ, వేగంగా మారే రకం స్పర్శ వల్లనే చక్కలిగిలి కలుగుతుంది. చక్కలిగిలి కలిగే చోట కూడా నిశ్చలంగా తాకినా గిలిగింత పుట్టదు, వేగంగా కదిలే వేళ్ల వల్ల ఆ స్పర్శలో వేగవంతమైన మార్పులు వచ్చినప్పుడే చక్కలిగిలి పుడుతుంది.

అయితే ఈ తేలికైన తాకిళ్లు ఎందుకు మనలో ప్రత్యేకమైన అనుభూతి కలిగిస్తాయి? సాధారణంగా మన చర్మం మీద మనకి కనిపించని చోట ఏదైనా తేలికగా ఈకలా తాకినప్పుడు గిలిగింత పుట్టదు. అదురు పుడుతుంది, ఉల్లిక్కి పడతాం. ఒళ్లు జలదరిస్తుంది. ఎందుకంటే ఏ పురుగో, సాలీడో మీద నెమ్మదిగా పాకినప్పుడు కలిగే అనుభూతి సరిగ్గా అలాగే ఉంటుంది. ఆ రకమైన స్పర్శల అర్థం నాడీమండలానికి తెలుసు కనుక, ఆ విధంగా అదురుపాటుతో స్పందిస్తుంది. ఆత్మరక్షణార్థం మనలో అప్రయత్నంగా జరిగే ఓ ప్రతిచర్య అన్నమాట.

కాని చిత్రం ఏమిటంటే ఇంచుమించు అలాంటి స్పర్శే ఓ పురుగు వల్ల కాక, ఓ మనిషి వల్ల కలిగితే భయం వెయ్యదు, చక్కలిగిలి పుడుతుంది, నవ్వొస్తుంది. ఇలా ఎందుకు జరుగుతోంది? ఓ పురుగో, మరో కీడు కలిగించే కీటకమో అయితే భయం వేస్తుంది. కాని అది మనిషి అని (ముఖ్యంగా తెలిసిన మనిషి అని, తన వల్ల ప్రమాదం లేదని) తెలిసినప్పుడు ఆ బెదురుపాటు కాస్తా నవ్వుగా వ్యక్తం అవుతుంది. ఏదో ముంచుకొచ్చింది అనుకున్నది కాస్తా ’ఓస్! ఇంతేనా?’ అన్న అనుభూతిగా మారుతుంది. ఉపద్రవం కావచ్చు అనుకున్నది ఉపశమనంగా పరిణమిస్తుంది. స్పర్శకి కారణం ఏంటో తెలీనప్పుడు కలిగే అభద్రతా భావం కాస్తా సుభద్రతా భావంగా మారుతుంది. హాయి కలిగిస్తుంది, నవ్వు తెప్పిస్తుంది.

బానే వుంది కాని ఇంతకీ మనకి మనం ఎందుకు చక్కలిగిలి పెట్టుకోలేం? చక్కలిగిలి పుట్టించే స్పర్శ అకస్మాత్తుగా, ఊహించని తీరులో జరగాలి. “ఇదుగో ఫలానా సమయంలో నిన్ను అంటుకుంటా జాగ్రత్త” అని ముహూర్తం పెట్టుకుని తాకితే చక్కలిగిలి పుట్టదు. ఆ స్పర్శ ఆశ్చర్యం కలిగించాలి. అనుకోని స్పర్శ కావాలి. (అందుకే సామాన్యంగా శరీరం మీద మనకి చక్కలిగిలి పుట్టించే స్థానాలు మన కంటికి ఆనని స్థానాలే అయ్యుంటాయి.) అందుకే మనకై మనం చక్కలిగిలి పెట్టుకోలేం. మన చేతి కదలికలు మన మెదడుకు తెలుసు కనుక మెదడు దానినది ఆశ్చర్యపరచుకోలేదు.

మనకి మనం గిలిగింతలు పెట్టుకోలేకపోయినా ఓ రోబో సహాయంతో ఆ మహత్కార్యం నెరవేరేలా ఏర్పాటు చేశారు కొందరు బ్రిటిష్ శాస్త్రవేత్తలు. ఈ పరికరాన్ని వాడదలచుకున్న వ్యక్తి వెల్లకిలా కళ్లు మూసుకుని పడుకోవాలి. ఆ వ్యక్తి పక్కనే రోబో ఓ మెత్తని ఈకలాంటిది తగిలించిన ఓ ప్లాస్టిక్ కమ్మీని పట్టుకుని ఉంటుంది. వ్యక్తి ఓ రిమోట్ కంట్రోల్ ని నొక్కినప్పుడు, రోబో స్పందించి ఆ ఈకతో వ్యక్తిని తాకుతుంది. అయితే ఆ స్పందనలో కొంత ఆలస్యం ఉంటుంది. ఎంత ఆలాస్యం ఉంటుందో వ్యక్తికి తెలీదు కనుక, రోబో ఎప్పుడు తాకబోతుందో వ్యక్తికి తెలీదు కనుక, ఆ స్పర్శ గిలిగిలి పుట్టిస్తుంది. ఆలస్యం అంటే మరీ ఎక్కువేం కాదు. అరసెకను కాలం ఆలస్యం ఉన్నా చాలు. అది వ్యక్తి నియంత్రణలో లేదు కనుక అది అకస్పాత్తుగా జరిగినట్టే అనిపించి గిలిగింత పుడుతంది.
చదవేస్తే ఉన్న మతి పోయినట్టు, ’రోబోలతో కితకితలు పెట్టించుకోవడం ఎలా?’ అన్న విషయం మీద పరిశోధనలు చేస్తున్న ఈ శాస్త్రవేత్తలకి ఇదేం పొయ్యే కాలం, అనుకుంటున్నారా? ’రోబో గిలిగిలి’ ఇక్కడ ముఖ్యోద్దేశం కాదు. చక్కిలిగిలి యొక్క లక్షణాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో రోబో ఒక సాధనంలా పనికొచ్చిందంతే.

No comments: