తిరుమల రెండవ ప్రాకారపు శాసనాల ఆధారంగా రాయలు 1514 నుండి జరిపిన తూర్పు దిగ్విజయ దండయాత్రలలో ఉదయగిరిని మాత్రమే కాక, అద్దంకి, వినుకొండ, నాగార్జున కొండ, కొండవీడు మొదలైన ప్రాంతాల్ని వశం చేసుకున్నాడు. కొండవీడు నగరాన్ని తన సైన్యంతో చుట్టుముట్టి కోట గోడల్ని విధ్వంసం చేసి, ప్రతాపరుద్ర గజపతిదేవుని కుమారుడైన వీరభద్రరాయన్ని సజీవంగా బందీ చేసినట్టు మనకు తెలుస్తోంది. ఆపై ఒరిస్సా గజపతి సామ్రాజ్యంలోని ఎన్నో ప్రాంతాలను ఆక్రమిస్తూ, గజపతి బంధుమిత్రులని, సామంతులని బందీలుగా చేసినా, పిదప వారి భద్రతకు ఏ ముప్పు వాటిల్లదని అభయమిస్తూ వారందరినీ ప్రాణాలతో వదిలేసినట్టు కూడా తెలుస్తోంది (ఈ శాసనాలలో కనిపించే అనేకానేక బిరుదులలో రాయలని ఒకచోట ‘యవనరాజ్య స్థాపనాచార్య’ అని కీర్తించడం ఆసక్తికరమైన విషయం).
గజపతిరాజులపై జరిపిన రెండవ విడత దండయాత్రలలో ఆనాటి కళింగ దేశపు ముఖ్య ప్రాంతాలైన బెజవాడ (విజయవాడ) నుండి కొండపల్లి వరకూ, ఆ పై సింహాద్రి-పొట్నూరు నుండి రాజమహేంద్రవరం వరకూ ఆక్రమించుకొని 1516 నాటికి తన రాజధాని విజయనగరానికి తిరిగి చేరుకున్నాడు. 1517 జనవరిలో తన విజయయాత్రలకు సంకేతంగా తిరుపతిని దర్శించి స్వర్ణ మణిమయాభరణాలను, మాన్యాలను ఆ దేవునికి కానుకగా సమర్పించుకున్నాడు. ఆ తరువాత కూడా కృష్ణదేవరాయలు తిరుమల దేవస్థానాన్ని 1521 వరకూ తరచూ సందర్శిస్తుండే వాడని శాసనాల ద్వారా తెలిసిన విషయం. ఇలా తూర్పు దిగ్విజయయాత్రలు జరుపుతున్న కాలంలోనే, బహుశా రెండవ విడత దండయాత్రలు జరిపే రోజుల్లో, కృష్ణదేవరాయలు ఆముక్తమాల్యద కావ్య రచనను ప్రారంభించాడని చెప్పవచ్చు. తన కావ్యంలోనే ఈ కృతి రచనకు పురికొల్పిన స్వప్న వృత్తాంతాన్ని వివరిస్తూ ఇలా అన్నాడు:
మున్నేఁ గళింగదేశ విజిగీషామనీషం దండెత్తిపోయి విజయవాటినిం గొన్ని వాసరంబు లుండి శ్రీకాకుళ నికేతనుండగు నాంధ్రమధుమథను సేవింపం బోయి హరివాసరోపవాసం బచ్చటఁ గావింప నప్పుణ్యరాత్ర చతుర్థ యామంబున …ఈ స్వప్న వృత్తాంత కాలనిర్ణయానికి మనకు రెండు శాసనాలు ఉపయోగపడుతున్నవి. మొదటిది అహోబిల శాసనం. రెండవది సింహాచల శాసనం. రాయలు కొండవీటి విజయానంతరం “ధరణికోటకు విచ్చేసి అమరేశ్వర మహాదేవునకు తులాపురుష మహాదానమున్ను చేయ నవధరించి – తిరిగి విజయనగరానకు విచ్చేసి మఱి కళింగదేశ విజయార్థమై విచ్చేయుచు - అహోబలానకు వేంచేసి దేవుని దర్శించి శ్రీ విజయాభ్యుదయ శా. సం. 1438 యగు నేటి యువ సం॥ర పుష్య శుద్ధ 15 శుక్రవాసర మందు శ్రీఅహోబల దేవునకు” నగలు అర్పించాడట. అహోబిల శాసన కాలం డిశంబర్ 1515. సింహాచల శాసనం 30 మార్చ్ 1516. ఈ రెండింటి నడుమ రాయలు శ్రీకాకుళం వెళ్ళాడు. ఇది బహుశా జనవరి 1516 కావచ్చు. ఇంతకంటే ఆధారాలు మృగ్యం.
శ్రీకాకుళ మహావిష్ణువు కలలో కనిపించి సంస్కృత భాషలో మదాలస చరిత్ర, సత్యవధూ పరిణయం, జ్ఞాన చింతామణి, రసమంజరి మొదలైన మధుర కావ్యాలు (ఈ కావ్యాలేవి మనకు ఇప్పుడు లభ్యం కావటం లేదు) రచించిన రాయలకు ఆంధ్ర భాష అసాధ్యం కాదని, అందుకని తెలుగులో ఒక కృతిని నిర్మించమని ఆదేశించినట్లు మనకు తెలుస్తోంది.
మఱియు రసమంజరీ ముఖ్య మధుర కావ్యస్వప్నం నుండి మేల్కొనగానే, మరునాడు ఉదయం రాయలు తన దండనాథ సామంతులతో కొలువు తీర్చి, ఆపై వివిధ వేదాగమ నిధులగు విద్వజ్జనంబులను పిలిపించాడట. వారికి తన స్వప్నవృత్తాంతం చెప్పగానే, వారంతా హర్షం వ్యక్తం చేసి, విష్ణువు ఆజ్ఞానుసారం కృతి నిర్మిస్తే ఉత్తరోత్తరాభివృద్ధి కలుగుతుంది కాబట్టి కావ్యాన్ని రాయాల్సిందేనని, కృష్ణదేవరాయలకు ‘సాహితీ సమరాంగణ చక్రవర్తి’ గా యశస్సు దక్కుతుందని ప్రోత్సహించారట.
రచన మెప్పించుకొంటి గీర్వాణ భాష
ఆంధ్రభాష యసాధ్యంబె యందు నొక్క
కృతి వినిర్మింపు మిక మాకుఁ బ్రియము గాగ.
కథాసంగ్రహం
ఆముక్తమాల్యద కథ పాండ్యదేశంలోని విల్లిపుత్తూరు పట్టణంలో జరుగుతుంది. ఈ కావ్యం ప్రథమాశ్వాసం విల్లిపుత్తూరు పట్టణ వర్ణనంతో, అందులో నివసించే విష్ణుచిత్తుడనే బ్రాహ్మణుని పరిచయంతో మొదలౌతుంది. ప్రబంధ సాహిత్య సంప్రదాయమైన ఋతువర్ణన ఆముక్తమాల్యదలో కూడా ఈ ఆశ్వాసంలో కనిపిస్తుంది. అయితే, మిగిలిన కవులకు భిన్నంగా రాయల వర్ణనలో సామాన్యమైన విషయాలు, సామాన్య జనుల జీవితాలలో కనబడే చిన్న చిన్న సంగతులు చోటుచేసుకుంటాయి. రెక్కలలో తల దూర్చుకొని పక్కకాలువల్లో పడుకొన్న బాతులను బ్రాహ్మణులు విడిచిపెట్టిన అంగవస్త్రాలుగా కాపలాదారులు భ్రమపడ్డారని చెప్పే విచిత్రమైన ఊహ రాయలది. బహుశా, సేనానాయకుని కొడుకుగా రాయలు తన చిన్నతనంలో సామాన్య ప్రజల మధ్య తిరుగుతూ, వారి జీవితాలను సూక్ష్మంగా పరిశీలించి ఉండి ఉంటాడని మనం చెప్పుకోవచ్చు. విష్ణుచిత్తుడు తన ఇంటికి వచ్చే అతిథులకు వివిధ కాలాల్లో చేసిపెట్టే వంటకాల వర్ణనతో ప్రథమాశ్వాసం ముగుస్తుంది.ఆముక్తమాల్యద కావ్యమంతా ఈ రకమైన జనసామాన్యపు వాస్తవిక జీవిత వర్ణనలతో నిండి ఉంటుందని భావించకూడదు. రెండవ ఆశ్వాసం పాండ్యదేశానికి రాజధాని అయిన మధుర గురించిన అద్భుతమైన వర్ణనలతో మొదలౌతుంది. ఈ దేశాన్ని పాలించే మత్స్యధ్వజుడనే రాజు సర్వ సద్గుణ సంపన్నుడు. గొప్ప దాత. ఏ ఈతి బాధల్లేకుండా ప్రజాపాలన చేస్తుంటాడు. వేసవికాలాన ఒకనాడు అరుగుమీద పడుకున్న బ్రాహ్మణులు పరలోకం గురించి చేస్తున్న సంబాషణ విని తాను తన రాజ్యాన్ని త్యజించాలని నిర్ణయించుకొన్నట్లు ప్రకటిస్తాడు. సర్వమత సిద్ధాంతులను రావించి మోక్షసాధనకు ఉత్తమమైన మార్గమేమిటో నిర్ణయించమని వాదాన్ని ఏర్పాటు చేస్తాడు. వైకుంఠంలోని విష్ణువు, తనను విల్లిపుత్తూరులో సేవించే విష్ణుచిత్తుణ్ణి మధురలో జరుగుతున్న వాదాలలో పాల్గొని తన మహత్వాన్ని స్థాపించి రాజును వైష్ణవుని చెయ్యమని కోరుతాడు. విష్ణుచిత్తుడు మధురకు జరిపే ప్రయాణ వర్ణనతో రెండవ ఆశ్వాసం ముగుస్తుంది.
మూడో ఆశ్వాసం మనకు కృష్ణదేవరాయలకు పురాణ శాస్త్ర గ్రంథాలతో ఉన్న గాఢమైన పరిచయాన్ని చూపెడుతుంది. మధురలో పండితుల వాదప్రతివాదాల మధ్య, మనం ఊహించినట్టుగా, విష్ణుచిత్తుడు అందరినీ ఓడిస్తాడు. శ్రీమన్నారాయణుడే పూజ్యుడని చెప్పే ఖాండిక్య కేశిధ్వజుల కథ చెబుతాడు. ఖాండిక్య, కేశిధ్వజులు అన్నదమ్ముల బిడ్డలు. ఖాండిక్యుడు కర్మయోగి. వైదిక కర్మకాండల గురించి క్షుణ్ణంగా తెలిసినవాడు. కేశిధ్వజుడు జ్ఞానయోగి. పెద్దవారయాక ఇరువురికి రాజ్యకాంక్ష పెరిగింది. కేశిధ్వజుడు యుద్ధంలో సోదరున్ని జయించాడు. ఖాండిక్యుడు భటులతో, హితులతో అడవులకు పోయాడు. కేశిధ్వజుడు తన విజయానికి సూచనగా మహాయజ్ఞం చేస్తాడు. అయితే, ఆ యజ్ఞానికి బలిపశువుగా నియోగింపబడ్డ ఆవును ఒక పులి తినేస్తుంది. యజ్ఞం నిర్విఘ్నంగా జరగడానికి చేయవలసిన ప్రాయశ్చిత్తం ఏమిటని మునులను అడుగుతాడు. వారు తమకు తెలియదని, అరణ్యవాసం చేస్తున్న ఖాండిక్యుడే చెప్పగలడని అంటారు. అరణ్యానికి వచ్చిన కేశిధ్వజునికి ధర్మసూక్ష్మం చెప్పవద్దని ఖాండిక్యుని మంత్రులంటారు. ఖాండిక్యుడు వారి మాటలు వినక ప్రాయశ్చిత్తాన్ని తెలియజేస్తాడు. కేశిధ్వజుడు యజ్ఞం పూర్తి చేసి ఖాండిక్యునికి గురుదక్షిణగా రాజ్యాన్ని ఇవ్వబోతాడు. ఖాండిక్యుడు వద్దంటాడు. కేశిధ్వజుడు కూడా అప్పుడు తన రాజ్యాన్ని త్యజించి మోక్ష సాధనకు విష్ణువే పర దైవమని తన కొడుక్కి పట్టభిషేకం చేస్తాడు.
విష్ణుచిత్తుడు ఈ కథ చెప్పి రాజును వైష్ణవునిగా మారుస్తాడు. రాజు విష్ణుచిత్తుణ్ణి గజాధిరోహణం చేయించి వైభవంగా ఊరేగించడంతో మూడవ ఆశ్వాసం అయిపోతుంది.
ఇక నాల్గవ ఆశ్వాసంలో, విష్ణుచిత్తుడు విల్లిపుత్తూరు చేరి పూర్వంకంటే ఎక్కువ భక్తిశ్రద్ధలతో భగవదర్చన కొనసాగిస్తాడు. విష్ణుచిత్తుని భక్తికి మెచ్చిన విష్ణువు లక్ష్మితో “పూర్వం యామునాచార్యునివంటివాడే ఈ విష్ణుచిత్తుడు” అనడంతో ఆమె యామునాచార్యుని చరిత్ర చెప్పమని కోరుతుంది. యామునాచార్యుడు విష్ణుభక్తుడైన నాథముని మనమడు. అదే సమయంలో మధురను పాలించే రాజు వీరశైవుడు. వైష్ణవద్వేషి. కాని అతని భార్య విష్ణు భక్తురాలు. విష్ణువు ఆజ్ఞ మేరకు యామునాచార్యుడు, రాణి ద్వారా ఆ రాజాస్థానానికి వెళ్ళి వాదించి, ఇతరులను ఓడించి విష్ణువే పరతత్త్వమని నిరూపిస్తాడు. రాజు యామునాచార్యునికి తన సోదరినిచ్చి వివాహం చేసి అర్ధరాజ్యాన్ని సమర్పించి గౌరవిస్తాడు. యామునాచార్యుడు దిగ్విజయయాత్రలు చేసి భోగభాగ్యాలనుభవిస్తూ రాజ్యం చేస్తుంటాడు.
యామునాచార్యుడిని ఈ బంధాలనుండి ఎలా తప్పించాలా అని ఆలోచించిన ఇతర వైష్ణవ భక్తులలో ఒకరైన శ్రీరామ మిశ్రుడు అతనికి సాత్వికాహారంగా అలర్కశాకం పెట్టిస్తాడు. దానితో యామునాచార్యునికి ఆత్మజ్ఞానం కలుగుతుంది. “మీ పెద్దలు మీకోసం జాగ్రత్త పరచిన నిక్షేపాన్ని చూపించడానికి వచ్చాను” అని శ్రీరామ మిశ్రుడు శ్రీరంగం తీసుకువెళ్ళి రంగనాథుని పాదపద్మాలే ఆ నిక్షేపం అని చూపగానే యామునాచార్యుని భ్రమలు తొలగిపోతాయి. కుమారునికి పట్టాభిషేకం చేసి, అతనికి రాజనీతిని ఉపదేశించి సన్యసిస్తాడు. యామునాచార్యుడు తన కుమారునకు బోధించిన రాజనీతిని ఈ వ్యాసంలోని చర్చకు ప్రధానాంశంగా వివరంగా మళ్ళీ పరిశీలిద్దాం.
పంచమాశ్వాసం నుండి సప్తమాశ్వాసం వరకు సుప్రసిద్ధమైన గోదాదేవి (ఆండాళ్) కథ ఉంటుంది. తులసివనంలో దొరికిన ఆడశిశువును గోదాదేవిగా విష్ణుచిత్తుడు పెంచుకొంటాడు. వయసు వచ్చిన గోదాదేవి విష్ణువునే వివాహమాడాలనుకుంటుంది. విష్ణుచిత్తుడు భగవంతునికోసం కట్టిన తులసిమాలను తండ్రికి తెలియకుండా అలంకరించుకొని తిరిగి ఆ మాలికను సెజ్జలో వదిలేసేది. ఒకరోజు నిజం తెలుసుకున్న విష్ణుచిత్తుడు కూతురిని కోపగిస్తాడు. గోదాదేవి శ్రీరంగనాథుని వరించిన విరహంతో ప్రాణత్యాగం చెయ్యడానికి నిశ్చయించుకుంటుంది. దాంతో విష్ణుచిత్తుడు దేవునితో మొర పెట్టుకుంటాడు. విష్ణువు అతని అమాయకత్వానికి చిరునవ్వు నవ్వి మాలదాసరి కథ చెబుతాడు. గోదాదేవిని శ్రీరంగం తీసుకువెళ్ళమని చెబుతాడు. గోదాదేవి శ్రీరంగనాథుల వివాహంతో ఈ కావ్యం ముగుస్తుంది.
రాజనీతి: ఇతర సంప్రదాయాలు
యామునాచార్యుడు తన కుమారునకు బోధించిన రాజనీతిలో రాజుగా కృష్ణదేవరాయల సొంత గొంతుక వినిపిస్తుంది. అయితే, ఈ రాజనీతి విభాగం సంక్లిష్టమైన నిర్మాణంతో పలు సంప్రదాయాల మేలుకలయికగా మనకు కనిపిస్తుంది. కౌటిల్యుని అర్ధశాస్త్రం నుండి అనాదిగా వస్తున్న సంస్కృత సాహిత్య రాజనీతి సంప్రదాయంతో పాటు తమిళంలోని తిరువళ్ళువర్ రాసిన కుఱళ్ లో (ఇందులోని ప్రధానాంశం రాజనీతి కాకపోయినా) కనిపించే నీతి ప్రబోధ సంప్రదాయాన్ని, మధ్యయుగంలో కొత్తగా వస్తున్న నీతి సాహిత్య సంప్రదాయంతో మేళవించి చెప్పడం ఆముక్తమాల్యద ప్రత్యేకత. మధ్య యుగంలో, 12వ శతాబ్దానికి చెందిన ‘మనోల్లాస’ రచించిన రచయిత ఆముక్తమాల్యద కృతికర్త లాగే స్వయంగా రాజు — దీన్ని చాళుక్య రాజైన మూడవ సోమేశ్వరుడు రాశాడు. అంతే కాక దేశ భాషలలో బద్దెన రాసిన ‘నీతిశాస్త్ర ముక్తావళి’ వంటి నీతి సాహిత్యం కూడ మధ్యయుగంలో కనిపిస్తాయి. ఆనాటి రాజకీయ వాస్తవికతకి అద్దం పట్టే ఈ సాహిత్యం, బ్రిటిష్ వారి పాలన కంటే ముందు భారతీయ సాహిత్యమంతా ఆదర్శవాద సాహిత్యమేనన్న వాదన సత్యదూరమని స్పష్టం చేస్తాయి. అయితే, ఈ నీతి సాహిత్యంలో కనిపించే వాస్తవికతత్వం, చర్విత చర్వణమైన పడికట్టు నీతులు గానే తప్ప, ఆనాటి చారిత్రక పరిస్థితులకు చైతన్యవంత ప్రతిస్పందనలా కనిపించవు. అలాగే, పారశీక భాషలో కనిపించే ‘యువరాజ ప్రబోధ’ సాహిత్యపు ప్రభావం కూడా ఆనాటి మొగల్ రాజులపై, దక్షిణ దేశపు సుల్తానులపై ఉండేది. అయితే, పారశీక భాషలోని ఈ ‘యువరాజ ప్రబోధ’ సాహిత్యపు మూలాలు సంస్కృతంలోని ‘పంచతంత్ర’లో కనిపిస్తాయి. సంస్కృత పంచతంత్రం ‘కలిల వా దిమ్మ’ (కరట(క) దమనులు) అన్న అనువాదం ద్వారా పారశీక ప్రపంచానికి సుపరిచయం. ఆ అనువాద ప్రభావంతోనే, ముస్లిములు కాని రాజులకు మతపరమైన అంశాలను ప్రస్తావించకుండా లౌకికమైన రాజనీతిని బోధించడానికి అనువుగా ప్రారంభమైనదే ‘యువరాజ ప్రబోధ’ సాహితీ సంప్రదాయం.ఆముక్తమాల్యద లోని రాజనీతి విభాగాన్ని చూస్తే, ఈ రచయితకు పైన పేర్కొన్న సంప్రదాయాలన్నింటితో పరిచయం ఉన్నట్టుగా స్పష్టం అవుతుంది. అయితే, ‘యువరాజ ప్రబోధ’ సాహిత్యంలో కనిపించని అనుభవపూర్వకమైన, ఆచరణాత్మకమైన బోధ ఆముక్తమాల్యదలో కనిపిస్తుంది. ఆదర్శాలను, ధర్మశాస్త్రాలను వల్లె వేయటం కాకుండా, 16వ శతాబ్దపు రాజకీయ, ఆర్థిక, వ్యవస్థాత్మక మార్పులు, ఆనాటి వాస్తవిక పరిస్థితులు ఆముక్తమాల్యదలో ప్రతిబింబిస్తాయి. కానీ, కొన్ని చోట్ల వైయుక్తికమైన అభిప్రాయలతో పాటు, సనాతన నీతిశాస్త్రాలలోని వాక్యాలు దాదాపు యథాతథంగా కనిపిస్తాయి. మొత్తానికి, ఆముక్తమాల్యద లోని రాజనీతి, విభిన్న సాంప్రదాయిక నీతిసూక్తులను తన స్వానుభవాలతో సమన్వయం చేసిన విలక్షణమైన సమ్మిశ్రమంగా కనిపిస్తుంది.
రాజనీతి: చారిత్రక నేపథ్యం
దక్కన్ పీఠభూమిపై విజయనగర పరిపాలన, 14వ శతాబ్దపు చివరిలో కుమార కంపన చేసిన దక్షిణదేశ దండయాత్రలలో భాగంగా మాబర్ సుల్తానును ఓడించడంతో ప్రారంభమయింది. అయితే, పదిహేనవ శతాబ్దమంతా అంతర్గత కలహాలతోను, స్థానిక తిరుగుబాట్లతోను, పొరుగు రాజుల దండయాత్రలతోను విజయనగర సామ్రాజ్యం ఎన్నో ఒడిదుడుకులని ఎదుర్కుంటూ ఉండేది. కృష్ణదేవరాయలకు పూర్వం 15వ శతాబ్దపు మధ్యభాగంలో పాలించిన దేవరాయల కాలంలో విజయనగరం ఇంకా పశ్చిమ రాజ్యంగానే ఉంటూ, ప్రతి సంవత్సరం మారిపోయే సరిహద్దులతో అస్థిరంగానే ఉండేది.కృష్ణదేవరాయలు 1509లో రాజైనట్లు మనకు తెలుస్తోంది. ఇప్పుడు లభిస్తున్న పలు శాసనాల ఆధారంగా, అతని పట్టాభిషేక మహోత్సవం 1509 ఆగస్ట్ 8న జరిగినట్లు చెప్పవచ్చు. ఆయన రాజుగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే, రాజకీయంగా ఎన్నో గడ్డు సమస్యలను పరిష్కరించవలసి వచ్చింది. 16వ శతాబ్దపు మొదటి దశాబ్దంలో విజయనగర సామ్రాజ్యం ఎన్నో రాచరిక సమస్యలను ఎదుర్కొన్నది. సాళువ వంశపు చిట్టచివరి రాజు పరిపాలిస్తూ ఉండగానే కృష్ణదేవరరాయల సోదరుడైన వీర నరసింహ నాయకుడు రాజ ప్రతినిధిగా రాజ్యాన్ని నడిపేవాడు. నిజానికి సాళువ నరసింహ రాయల (1456-1491) మరణానంతరం అతడి పుత్రుడైన ఇమ్మడి నరసింహ రాయడు రాజైనా రాజ్యాధికారమంతా తుళు ప్రాంతపు నాయకుడైన నరస నాయకుని చేతిలోకి, అతడి మరణానంతరం అతడి కొడుకులలో ఒకరైన వీర నరసింహ నాయకుని చేతిలోకి చేరుకుంది. 1505లో వీర నరసింహ నాయకుడే ఇమ్మడి నరసింహ రాయుడిని చంపించి, వీర నరసింహ రాయలుగా తానే సింహాసనాన్ని అధిష్టించాడు. దీనికి సంబంధించిన వివరాలు 1506లో రాసిన పోర్చుగీసు వ్రాతప్రతిలో స్థూలంగా వివరించారు. ఈ రకమైన సమస్యలు – అంతర్గత కలహాలు, పొరుగు రాజుల దండయాత్రలు, స్థానిక నాయకుల తిరుగుబాటు – ఆముక్తమాల్యదలోని రాజనీతి విభాగంలో మనకు అంతర్లీనంగా గోచరిస్తాయి: ఏ రకమైన రాజకీయ వ్యవస్థ ద్వారా చిన్న రాజ్యాన్ని సామ్రాజ్యంగా విస్తరింపజేస్తూ కూడా స్థిరత్వాన్ని సాధించవచ్చు? ఎవరిని నమ్మవచ్చు? ఎవరిని నమ్మకూడదు? ఎవరికి ఎంత అధికారం ఇవ్వాలి? ఎవరిని అదుపులో పెట్టాలి?
వేరేవిధంగా చెప్పాలంటే, స్థానిక నాయకులను, సామంత రాజులను ఎంత వరకు నియంత్రించాలి, వారికి ఎంత స్వయం ప్రతిపత్తి కలిగించాలి అన్నది ఆ రోజుల్లో భారతీయ రాజులందరు ఎదుర్కొన్న సమస్య. ఈ సందిగ్ధత కృష్ణదేవరాయల ఆముక్తమాల్యదలోనూ కనబడుతుంది. ఎక్కడో పశ్చిమ తీరంలోని తుళునాటికి చెందిన కృష్ణదేవరాయలకు, దక్షిణాదిన తూర్పు తీరం నుండి పశ్చిమ తీరం వరకూ విస్తరించిన విజయనగర సామ్రాజ్యాన్ని ఏలడానికి తన ప్రాంతీయతత్వాన్ని విడనాడి, సర్వ ప్రాంత సమ్మతమైన రాజనీతిని సృష్టించుకోవల్సిన అవసరం ఏర్పడింది. అయితే ఈ విషయంలో, కృష్ణదేవరాయలు పాత పద్ధతిలో పురాణాలలో, ధర్మశాస్త్రాలలో చెప్పబడిన బ్రాహ్మణ-క్షత్రియ మైత్రిపై ఆధారపడకుండా వైష్ణవమతానుబంధంగా ఒక కొత్త రాజనీతిని నిర్వచించాడు. అంతకు కొద్దికాలానికి పూర్వమే విజయనగర నేతలు శైవమతం నుండి వైష్ణవమతావలంబికులుగా మారారన్న సత్యాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి.
రాజనీతి: విశ్లేషణ
పైన చెప్పిన నైతిక సాహితీ సంప్రదాయాలు, చారిత్రక పరిణామాల నేపథ్యంలో కూర్చబడ్డ ఆముక్తమాల్యద రాజనీతి విభాగంలోని పద్యాలను కొన్నింటిని విపులంగా పరిశీలిద్దాం.స్థానిక నాయకుల, సామంత రాజుల నియంత్రణే కాకుండా స్వతంత్రంగా జీవనం సాగించే ఆటవిక జాతి ప్రజలను ఎలా అదుపులో ఉంచాలన్న విషయచర్చ కూడా ఆముక్తమాల్యదలో కనిపిస్తుంది. ఉత్తర, ఈశాన్య సరిహద్దులలో నివసించే మన్య ప్రాంత ప్రజలే కాక, నైరుతి దిశలోని కొడగు (కూర్గ్) ప్రాంత ప్రజలు, పశ్చిమ కనుమలలో నివసించే ఆటవికులను దృష్టిలో ఉంచుకొని ఈ పద్యాలు రాసి ఉండవచ్చు.
క్షమఁ గుఱుమన్నెపుం గహనచారి జనంబెడ దోషదృష్టి కుఆముక్తమాల్యదలో చెప్పిన రాజనీతి ఒక సామ్రాజ్య నిర్మాణానికి అవసరమైన రాజనీతి. అనుభవజ్ఞుడైన రాజు, తన దశాబ్ద కాలపు స్వానుభవాలను సాలోచనగా మనకు చెబుతున్నట్టు అనిపిస్తుంది. కొన్ని సార్లు, రచయిత చెప్పే నీతులు లోకవిరుద్ధంగా కనిపిస్తాయి. ఉదాహరణకు, ఈ కింది పద్యంలో దుర్గములకు సేనానులుగా బ్రాహ్మణులనే నియమించమని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
డ్యము గడుంగంగఁ బూన్కి; దెగ దల్గిన సర్వము; బాస నీగి వ
శ్యముగ నొనర్ప దాడి కగు; నౌ గడి కొల్లలకు; న్శతాపరా
ధమును సహస్రదండము నతర్క్యము సర్వము నేలువానికిన్ (257)
మన్నెం జనం చాలా తప్పులు చేస్తారు. వాళ్ళను దండించి మార్చాలనుకోవటం మట్టిగోడను కడగటం లాంటిది. బహుమానాలిచ్చి, నిజం తప్పకుండా మెలిగి, వాళ్ళతో స్నేహం చెయ్యి. నీ యుద్ధాల్లో వాళ్ళు బాగా సహాయపడతారు.
దుర్గములాప్త ద్విజవరఅనాదిగా క్షత్రియ ధర్మాలుగా భావించే సేనాధిపత్యాన్ని బ్రాహ్మణులకు ఇవ్వమనడం విశేషం. అయితే, ఆనాటి ఇతర రాజుల గురించి, రాజ్యాల గురించి, ఆ కాలపు పౌరుష్యశాస్త్రాన్ని గురించి అధ్యయనం చేస్తున్న నేటి పండితులకు ఈ నీతి సబబుగానే తోస్తుంది. ఇటువంటి దృక్పథాన్నే వివరించే మరో పద్యం చూడండి:
వర్గమునకె యిమ్ము; దుర్గవత్తత్తతి క
త్యర్గళ ధరాధిరాజ్య వి
నిర్గత సాధ్వసత పొడమ నిలుపకు కొలఁదిన్ (207)
ఆప్తులైన ద్విజులను దుర్గములకు అధిపతులుగా నియమించు. అయితే, ఈ దుర్గాలను కాపాడుకోవడానికి ఎంత అవసరమో అంత సైన్యాన్ని మాత్రమే ఇవ్వు. నివారింప శక్యము గాని సైన్యాధిపత్యం వారికి ఇవ్వటం వలన వారు నీ పట్ల భయము లేకుండా మసలే అవకాశం ఉంది.
బాహు జాంఘ్రిజ ముఖ విడంబనకు నయినఁఅంతేకాక, బ్రాహ్మణ ధర్మము స్థానిక ప్రాంతీయ భేదాల నుండి కొంత స్వతంత్రంగా ఉంటుంది కాబట్టి వారిని నియంత్రించడం కొంత సుళువు. అదీకాక, ఈ పాటికి బ్రాహ్మణులు వైదికకర్మలేకాక, యుద్ధవిద్యలలోను, ఇతర లౌకిక కర్మలలోనూ ఆరితేరిన వారౌతున్నారు. పీష్వా బ్రాహ్మణులు మరాఠ రాజ్యాన్ని ఏలిన 18వ శతాబ్దానికి ముందు రోజులివి. 17వ శతాబ్దంలో గోల్కొండ నవాబు వద్ద భూమి శిస్తు వసూలు పనులతో మొదలుపెట్టి, చివరకు యుద్ధరంగంలో పాల్గొన్న అక్కన్న, మాదన్నలు, ఆరోజుల్లో బ్రాహ్మణులు క్షాత్రధర్మాన్ని కూడా నిర్వర్తించారని చెప్పడానికి మరో ఉదాహరణ.
గొలిచి మనువిప్రధర్మంబు దెలిసి యైనఁ
బూని సంకటముల నిల్చుఁ గానఁ దఱచు
బ్రాహ్మణునిఁ బ్రభుఁ జేయుట పతికి హితము (217)
క్షత్రియ, శూద్రుల అపహాస్యానికి వెరచియైనా – విప్రధర్మము, మను ధర్మము తెలిసిన వాడుగా – సంకటపువేళలలో పూని నిల్చువాడు కాబట్టి బ్రాహ్మణుడిని ప్రభువుగా నియమించుట రాజుకు హితమే.
అయితే, బ్రాహ్మణులపై చూపించే ఆదరణ, వారు తన వ్యవస్థకు లోబడి ఉన్నంతవరకే కాని వారికి స్వతంత్ర ప్రతిపత్తి కలిగించేదిగా ఉండకూడదు. చాలా ప్రసిద్ధమైన ఈ కింది పద్యం చూడండి:
అక్షర పక్షపాతమున నర్థము నూళ్ళ నొసంగి, నుబ్బునన్పై పద్యం ముఖ్యంగా మఠాధిపతులను దృష్టిలో ఉంచుకొని రాసినట్టుగా అనిపిస్తుంది. ఈ పద్యం పదిహేను-పదహారవ శతాబ్దపు కాలంలో మఠాధిపతులకు, రాచరిక వ్యవస్థకు మధ్య ఉన్న ఘర్షణను ఎత్తిచూపుతుంది. శృంగేరి మఠానికి, విజయనగరానికి మధ్య ఉన్న సంక్లిష్టమైన సంబంధంపై మరిన్ని వివరాలకు హెర్మన్ కుల్కే (Hermann Kulke) రాసిన Maharajas, Mahants and Historians: Reflections on the Historiography of Early Vijayanagara and Sringeri ని చూడవచ్చు.
భిక్షుజటాధరాదికులు భిన్న నిజవ్రతులౌదు; రైన దు
ర్భిక్షరుజా శిశుచ్యుతులు పెక్కగు; భక్తియు చాలు, దానఁ ద
త్ప్రక్షుభితత్వ మేయఘముఁ దార్పదు, శంకఁ దలంగు మియ్యెడన్ (242)
అక్షర పక్షపాతముతో ధనాన్ని, ఊళ్ళను ఇస్తే పొగరుతో ఉబ్బిపోయి భిక్షువులు, జటాధరులు నియమాలు పాటించని వారౌతారు. అలా కావడంతో దుర్భిక్షము, వ్యాధులు, బాలారిష్టాలు పెరుగుతాయి. కాబట్టి వారి పట్ల భక్తి చాలు. వారు క్షోభపడుటవలన ఏ పాపము కలుగదు. సందేహపడకు.
ఇంతే కాక, ఆముక్తమాల్యద కావ్యంలో విస్తరిస్తున్న విజయనగర సామ్రాజ్యాన్ని సూచించే పద్యాలు మనకు కనిపిస్తాయి. కొత్త ప్రాంతాలను, ప్రజలను తన రాజ్యంలో కలుపుకోవటంలో ఉండే సాధకబాధకాలను రాయలు కొన్ని పద్యాల ద్వారా మనకు సూచిస్తాడు. ఈ సామ్రాజ్య విస్తరణతో పాటు ఇతర రాజ్యాలతో, దేశాలతో ఆర్థిక సంబంధాలు, సరకుల ఎగుమతి, దిగుమతితో కూడిన వాణిజ్య సంబంధాలు పెరిగాయని చెప్పవచ్చు. అందుకే ఒక పద్యంలో పొరుగుదేశాల వర్తకులను గౌరవంగా చూసుకోవాలని, ఓడరేవులను జాగ్రత్తగా కాపాడుకోవాలని చెబుతాడు. పొరుగుదేశాలవారితో సముద్ర వర్తకమంటే భయపడే ఇతర రాజ్యాలకు భిన్నంగా విజయనగర రాజులు సముద్ర వ్యాపారం చేసేవారని పోర్చుగీసు ఆధారాల ద్వారా మనం ధృవపరుచుకోవచ్చు.
రేవు ల్మావు మతంగజంబును మణిశ్రీఖండముక్తాదియున్ఈ రకమైన ఆదరణ చూపడంలో రాజు అమాయకత్వమేమీ లేదు. ఆ రోజుల్లో సముద్ర వ్యాపారానికి, యుద్ధరంగంలో విజయాలకు ఉన్న అవినాభావ సంబంధం మనకు తెలిసిందే. న్యూనెస్ (Fernao Nunes) 1530లో రాసిన లేఖల ఆధారంగా విజయనగర రాజులు మేలిమి జాతి గుర్రాలని విదేశాలనుండి దిగుమతి చేసుకునే వారని తెలుస్తుంది. సాళువ నరసింహరాయలు తనకు కావల్సిన గుర్రాలని హోర్ముజ్ నుండి, ఏడెన్ నుండి తెప్పించుకొనేవాడని, అందుకు ప్రతిగా ఆ వర్తకులకు వారు అడిగినంత ధనం ముట్టజెప్పేవాడట. న్యూనెస్ కృష్ణదేవరాయల గురించి రాస్తూ, “ఈ రాజు పదమూడు వేల హోర్మూజ్ గుర్రాలని తెప్పించుకొని, అందులో నాణ్యతగల గుర్రాలని తన గుర్రపుశాలలో వినియోగించాడు” అని పేర్కొన్నాడు. ఈ కింది పద్యం న్యూనెస్ చెప్పిన అభిప్రాయాన్నే దృవీకరిస్తున్నదని చెప్పవచ్చు:
రా, వాణిజ్యము పెంచి యేలఁగ నగు; న్వర్షంపు టెవ్వన్ రుజన్
హావళ్ళిన్ దిగు నన్యభూప్రజల రా జాయాయిజాత్యౌచితిన్
బ్రోవంగాఁదగుఁ; దోఁట దొడ్డి గను లాప్తుల్చూడఁ బంపందగున్ (245)
రేవులకు గుర్రాలు, ఏనుగులు, రత్నములు, చందనము మొదలగు పరిమళ ద్రవ్యములును, ముత్యములు వచ్చునట్లుగా వాణిజ్యము పెంచి పోషించాలి. క్షామము చేత, రోగము చేత, అలసట చేత దిగు అన్య దేశ ప్రజలను రాజు వారి వారి జాతికి తగినట్లుగా రక్షించాలి; తనకు ఆప్తులైన వారికి తోటలు, దొడ్లు, గనులు మొదలగు బహుమానాలతో పరామర్శ చేయుటకై పంపుట యుక్తము.
సింధుర మహాశ్వముఖ్యము ల్చేర్చు దౌల
దీవి వణిజుల కూళ్ళు సద్గృహములు పురిఁ
గొలుపుఁ దేజంబు వెల మేలు గలుగఁ బ్రాఁత
వారిఁగాఁ జేయు మరి నవి చేరకుండ (258)
ఏనుగులను, గొప్ప గుర్రాలను మొదలగువానిని తెచ్చునట్టి దూర ద్వీప వర్తకులకు ఊళ్ళు, నీ పట్టణాలలో మంచి ఇండ్లు, కొలువును, బహుమానాలను అందించు. వారికి మంచి ధర ఇచ్చి వారి వస్తువులు నీ శత్రువులకు చేరకుండా నీకు చెందేట్లుగా చేసుకో.
పొరుగువారితో వాణిజ్య సంబంధాలే కాక, దేశ ఆర్థిక ఔన్నత్యానికి కావలసిన మౌలిక వసతులు, వనరులు కల్పించి దేశాన్ని సుభిక్షంగా ఉంచడం చాలా ముఖ్యమని ఈ కింది పద్యం చెబుతోంది:
దేశ వైశాల్య మర్థసిద్ధికిని మూలఇది శ్రీవైష్ణవ మతానుసారమైన కొత్త రాజనీతికి ప్రతీక. భోగానురక్తులకు బాహాటంగానే ప్రోత్సహించే తత్త్వనీతిసారం. తరువాతి కాలంలో, అమిత భోగలాలసత్వానికి ప్రాధాన్యత ఇచ్చిన నాయక రాజుల రాజతంత్రం ఒక రకంగా విజయనగర రాజనీతి ప్రభావ ఫలితమనే చెప్పవచ్చు. (నాయకరాజుల భోగలాలసత్వం పై మరిన్ని వివరాలకు వెల్చేరు నారాయణరావు, డేవిడ్ షూల్మన్, సంజయ్ సుబ్రమణ్యం రాసిన Symbols of substance: Court and State in Nayaka-Period Tamilnadu పుస్తకం చదవండి.)
మిల యొకింతైన గుంటగాల్వలు రచించి
నయము పేదకు నరిఁ గోరునను నొసంగి
ప్రబలఁ జేసిన నర్థ ధర్మములు పెరుఁగు (236)
దేశ ఆర్థిక సిద్ధికి మూలమైన భూమి కొంచమైనా, తటాకాలు, కాల్వలు నిర్మించి పేదవారికి పన్నులు కట్టడంలో వెసులుబాటు కలుగజేసి వారు వృద్ధి పొందటానికి అవకాశం కల్పిస్తే, దేశములో ధర్మార్థములు కూడా వృద్ధి చెందుతాయి.
ఎచ్చో గజఘోటక్రయరాజుల జీవితంలో భక్తి, వైరాగ్యాలకు కూడా ప్రాధాన్యత ఉంది కాని, అది సరైన సమయంలో ఆచరించవలసిన ఆశ్రమ ధర్మం. రాజ సింహాసనం అధిష్టించి, రాజ్యపాలన జరిపే సమయంలో రాచరికపు భోగాలను త్యజించాలనుకోవడం అర్థం లేని పని. ఈ రకమైన దృక్పథం శ్రీవైష్ణవ మతం బోధించే వాస్తవిక తత్త్వ ప్రభావమే. ప్రజలు ముఖ్య అనుభోక్తగా భావించే రాజే రాజ్యసుఖాలను అనుభవించకపోతే ఇక ఆ ప్రజలు ఏ రకంగా సుఖానురక్తులై ఉండగలరు?
తచ్చర్వణసుభటజీవి తద్విజసురపూ
జోచ్చనిజభోగముల కగు
వెచ్చము వెచ్చంబు గాదు విత్తంబునకున్ (262)
ఏనుగులు, గుర్రాలను కొనుటకు, వాటిని మేపుటకు అయ్యే ఖర్చు, మంచి భటుల జీతాలకు, బ్రాహ్మణులకు, దేవతల పూజలకు, రాజుల ఉన్నతమైన భోగాలకు అయ్యే ఖర్చు దుర్వ్యయమని తలపరాదు.
తనుభృశ దమనజ సుకృతమునిజానికి, ఈ విభాగంలో ఒక్కోసారి రాజు శరీరానికి, రాజ్య భూభాగానికి అంతరం లేకుండా ఒకదానికి మరొకటి ప్రతీకలుగా వాడడం గమనించవచ్చు. శరీరపరంగా, రాజ్యపరంగా ప్రతి విశేషణానికి రెండురకాలుగా అర్థాలు వచ్చేటట్టు ఉభయాన్వయంగా నడిపించిన ఈ అద్భుతమైన పద్యాన్ని చూడండి:
ధనదత్తినె కొనఁగవలయుఁ దత్తదృతుకమ
ర్దన మజ్జన భోజన లే-
పన వసన ప్రసవ వహనపరతం బతికిన్ (280)
తన తనువును మిక్కిలి ఉపవాసాలతో శోషింపజేసి సంపాదించే పుణ్యమును ధనమును దానం చెయ్యడం ద్వారా కూడా పొందవచ్చు. అందువలన ఏయే కాలాలకు అనుకూలమైన మర్దన, స్నాన, భోజనాలను, లేపనాలు, వస్త్రాలు, పుష్పాలతో కూడిన సేవలను స్వీకరిస్తూ రాజు ఆయాకాలాలలో సుఖాలను అనుభవించాలి.
తద్‌జ్ఞ మండలిఁ గూర్చి ధాతువుల్ దెలిసి హేపై పద్యం రాజు రాజ్యాన్ని ఎలా చూసుకుంటాడో తన శరీరాన్ని అలాగే పరిరక్షించుకోవాలి అని చెప్పటం ద్వారా ఆ రోజుల్లో రాజదేహానికి ఇచ్చిన ప్రాముఖ్యతను వెల్లడి చేస్తుంది. తిరుపతి వంటి వైష్ణవ దేవాలయాల్లో దేవుని విగ్రహాలంకరణలకు ఇచ్చే ప్రాముఖ్యత కూడా వైష్ణవ మతస్తుల దేహప్రాధాన్యతను తెలుపుతుంది. విజయనగర రాజులగురించి విపులంగా రాసిన పోర్చుగీసు వారి రాతలలో కూడా ఈ విషయం స్పష్టమౌతుంది. 1510లో కృష్ణదేవరాయల గురించి పేస్ రాసిన ఈ వాక్యాలు చూడండి:
మాదులఁ గొని ప్రకృత్యనుగుణాల్ప
జీవనాహృతులచేఁ జెలఁగి మహాబలో
ద్రేకంబు మర్దన రిత్తఁ జేసి
స్నేహార్ద్రుఁ డగుచు నశేషంబుఁ బోషించి,
నరవర్ణముల తప్పు సరణు లుడిపి
సతతద్విజ ప్రతిష్ఠాశాలియై బలి
యించుపట్టులు బలియించి పలుచఁ
జేయ పట్టులు పలుచఁగాఁ జేసి తేజ
మొసఁగ శోధన మఱవక యొసఁగ వలయు
సాంగ రాజ్య మొకెత్తుగ స్వాంగ రాజ్య
మొక్క యెత్తుగ నృపతి యా యుష్యపరత (270)
శరీర పరంగా: వైద్యులను (తద్‌జ్ఞ మండలి) కలసి, సప్త ధాతువులను తెలుసుకొని సువర్ణ భస్మము మొదలగు వానిని పుచ్చుకొని (హేమాదులన్ గొని), తన శరీర ప్రకృతికి అనుగుణంగా మిత భోజన స్వీకరణతో, వాతము యొక్క ఉద్రేకాన్ని మర్దనతో అణగించి, నూనె పూసుకొన్న (స్నేహార్దుడు: స్నేహ=నూనె + ఆర్దుడు=పూసుకున్న వాడు) వాడై, అన్ని అంగాలను పోషించి, నెరసిన రంగులను (నరవర్ణముల) మాన్పి (ఉడిపి), ఎల్లప్పుడు దంతములయొక్క (ద్విజ) ఉనికిని కాపాడువాడై (ప్రతిష్ఠాశాలియై), చేతికండలను (బలియించు పట్టుల) బలిసేటట్టు చేసి (బలియజేసి), నడుమును, కడుపును సన్నగా చేసి (పలుచజేయు పట్టుల పలుచజేసి), తేజస్సు కలుగునట్లుగా మరువక దేహశుద్ధి (శోధన) చేసుకొని వర్థిల్లాలి (ఎసఁగ వలయు) ఆయుర్వృద్ధి కోసం (ఆయుష్య పరత).
రాజ్య పరంగా: అభిజ్ఞులను (తద్‌జ్ఞ మండలి) కలసి, సువర్ణాది జనకములైన ధాతువులను తెలుసుకొని, వానిని పుచ్చుకొని (హేమాదులన్ గొని), ప్రజల ప్రకృతికి అనుగుణంగా మితమైన పన్నులతో, ప్రబల శత్రువు యొక్క ఉద్రేకాన్ని మర్దనతో అణగించి, స్నేహర్దుడై, సమస్త ప్రజలను పోషించి, బ్రహ్మణాది వర్ణముల యొక్క (నరవర్ణముల) తప్పు సరణులు మాన్పి (ఉడిపి), ఎల్లప్పుడు ద్విజుల ప్రతిష్ఠలను కాపాడువాడై (ప్రతిష్ఠాశాలియై), దుర్గముల (బలియించు పట్టుల) బలోపేతం చేసి (బలియజేసి), మధ్యదేశమందలి అడవులను పలుచగా చేసి (పలుచజేయు పట్టుల పలుచజేసి), తేజస్సు కలుగునట్లుగా మరువక శోధన చేసుకొని వర్థిల్లాలి (ఎసఁగ వలయు) రాజ్య ఆయుర్వృద్ధి కోసం (ఆయుష్య పరత).
The king is accustomed to drinking a quantity (quartilho: three-quarter pint) of sesame oil every day before daylight, and he anoints himself all over with the said oil; he covers his loins with a small cloth, and takes in his arms great weights made of earthenware, and then, taking a sword, he exercises himself with it till he has sweated out all the oil, and then he wrestles with one of his wrestlers. After this labour he mounts a horse and gallops about the plain in one direction and another till dawn, for he does all this before daybreak. Then he goes to wash himself, and a Brahmin washes him whom he holds sacred, and who is a great favourite of his and is a man of great wealth …”
అంతకు ముందే కృష్ణదేవరాయలను వర్ణిస్తూ పేస్ రాసిన దాన్ని బట్టి రాయలు ఆజానుబాహుడేమీ కాదని, స్ఫోటకపు మచ్చలున్న ముఖంతో కొంత స్థూలకాయుడేనని మనకు తెలుస్తోంది. అయితే, పేస్ వర్ణనలో రాయలు మంచి రంగుగల దేహంతో ఎప్పుడూ అహ్లాదకరమైన చిరునవ్వుతో ఉండేవాడని కూడా తెలుస్తున్నది. పొరుగువారైన పోర్చుగీసు వారిచేత కూడా రాజులలో ఉత్తముడిగా, ధర్మ ప్రభువుగా కీర్తింపబడటం రాయల గొప్పతనాన్ని చాటుతున్నది.
పేస్ వర్ణనలలో రాయలు ఆదర్శవాదిగా కాక, ఆచరణాత్మకమైన క్రియాశీలిగా మనకు కనిపిస్తాడు. తన పనులను తన కింది అధికారులకు అప్పజెప్పి రాజ భోగాలలో, సాహితీ గోష్టులలో మునిగి తేలే రాజు కాదు రాయలు. పేస్ మాటల్లోనే, రాయల దినచర్య ఇలా ఉండేదట:
Thence he goes to a building made in the shape of a porch without walls, which has many pillars hung with cloths right up to the top, and with the walls handsomely painted (…). In such a building he dispatches his work with those men who bear office in his kingdom, and govern his cities, and his favourites talk with them. The greatest favourite is an old man called Temersea [timmarusu] he commands the whole household, and to him all the great lords act as to the king. After the king has talked with these men on subjects pleasing to him he bids enter the lords and captains who wait at the gate, and these at once enter to make their salaam to him (Sewell, A forgotten Empire, 241-242).
రాజు తన దేహాన్ని ప్రతినిత్యం వ్యాయామాలతో యుద్ధరంగంలో పాల్గొనడానికి అనువుగా పుష్టిగా ఉంచుకున్నా, ఆముక్తమాల్యద రాజనీతి ప్రకారం రాజు తనంతట తానుగా యుద్ధంలో పాల్గొనవలసిన అవసరం లేదు.
ధరణిపుఁ డెందునేఁ దగదు తాఁ జన నూఱట కొక్కనిం దగుంఅయితే, శ్రీకృష్ణదేవరాయలు ఈ సలహాను తానే పూర్తిగా పాటించలేదు. బీజాపూర్ పై చేసిన దండయాత్రలో కృష్ణదేవరాయలే స్వయంగా పాల్గొన్నట్టు మనకు తెలుస్తోంది. అయితే, రాయల అల్లుడైన అరవిదు రామరాయలవలే కృష్ణదేవరాయలు తెలివితక్కువగా ప్రతి యుద్ధంలో పాల్గొన్నాడని చెప్పడానికి వీలులేదు. అరవిదు రామరాయలు 1550లో, 1560లో జరిగిన యుద్ధాలలో స్వయంగా పాల్గొని, చివరకు 1565 యుద్ధంలో హతమార్చబడ్డాడన్న విషయం మనకు తెలిసిందే.
దొర నొనరించి వంప నరి దుర్బరులుచేఁ జెడఁ డాతఁ డర్థభూ
కరితురగర్థి లేక కొఱ గాఁడటు సేయ ద్విజాన్యుఁ డల్క కౌ
నెరపు నతండునున్ వలయు నిండిన దుర్గబలోర్వి యీఁ దగున్ (255)
రాజు తనంతట తానే శత్రువు వద్దకు వెళ్ళకూడదు. తన సహాయకులలో ఒకరిని అధిపతిగా చేసి పంపుట యుక్తము. శత్రువు బలహీనుని చేత సాధింపబడడు కావున ఆ అధికారికి కావలసిన ధన, భూ, హస్త, తురగాదులను ఇవ్వు. అబ్రాహ్మణునికి ఇటువంటి అధికారం ఇస్తే జయించిన రాజ్యం తనదేనంటాడు. కాబట్టి బ్రాహ్మణ అధికారికి దుర్గాదులిచ్చి అదుపులో పెట్టుకోవాలి.
ఆముక్తమాల్యదలోని రాజనీతిలో నిరాసక్తతతో కూడిన తాత్వికదృష్టి కనబడుతుంది. ఈ కింది పద్యంలోని ద్వంద్వ ప్రతిపాదనలను చూడండి:
చంపి ధార్మికుండు సతిఁ బొంది మఱి బ్రహ్మలోకధర్మం వేరు, రాజధర్మం వేరు అన్న విషయం ఈ రచయితకు స్పష్టంగా తెలుసు. ఇవేకాక, ఈ రాజనీతి విభాగంలో పాత నీతిశాస్త్రాలలో కనిపించే విషయాలు ఎన్నో కనిపిస్తాయి: బలవంతుడైన పొరుగు రాజులతో ఎలా ఉండాలి? బలహీనుడైన రాజుతో ఎలా ఉండాలి? న్యాయపాలన ఎలా చేయాలి? చారులను, భటులను ఎలా చూసుకోవాలి? తన కిందివారికి ఏ విధమైన బహుమానాలతో తన చెప్పుచేతల్లో ఉంచుకోవాలి? మొదలైన విషయాలపై చర్చ ఇందులో కనిపిస్తుంది. రాజులకు మంత్రులకు మధ్య ఘర్షణ ఏర్పడితే ఆ తగవును ఎలా పరిష్కరించాలన్నది కరణాలు రాసిన ఎన్నో పుస్తకాలలో సర్వసామాన్యంగా కనిపించే విషయమే. అదే విషయాన్ని ఈ రాజనీతి విభాగంలో రాజుగా తన దృష్టితో చూసి రాసిన ఈ పద్యాలని చూడండి:
చారి బొంకి సత్యశాలి యార
గించి సదుపవాసి కేడించి శూరుఁడు
చింది ధనియు నగు విచిత్ర సరణి (278)
రాజు యుద్ధంలో చంపినా ధార్మికుడే; సతులున్నా బ్రహ్మచారియే; అబద్ధమాడినా సత్యశాలియే; చక్కటి భోజనం ఆరగించినా ఉపవాసియే; ఉపాయాలతో గెలిచినా కూడా శూరుడే; దానం చేసినా ధనవంతుడే, విచిత్రమగు రీతిలో.
చదివి యధర్మ భీరు నృప శాస్త్ర విధిజ్ఞతల న్వయస్సు డెచతుర్థాశ్వాసపు చిట్టచివరి పద్యాలలో ఒకటైన ఈ కింది పద్యంలో తన రాజనీతి సారాంశమంతా గుదిగుచ్చినట్లు ఇలా అంటాడు:
బ్బదిటికి లోను నేఁబదికి బాహ్యమునై యరుజన్స్వపూర్వులై
మద మఱి రాజు ప్రార్థన నమాత్యతఁ గైకొని తీర్చు పాఱువా
రొదవిన నంగము ల్మిగుల నూర్జితమౌటకుఁ బూటసాలదే
అట్టి మంత్రివర్గంబు దొరకదేని
నీతిన్ దాని తలంచి చేయఁ బని గానీ కాకపోనీ బల
వ్రాతార్థాఢ్యత నెమ్మి నుండ కొరుఁ బ్రోవన్మంత్రి యంచుం గుణా
తీతున్ గుమ్మడికాయ యంత యగుముత్తెంబై మనంబేర్పన
ట్లే తా నాతని చేతిలో బ్రదుకువాఁడే యౌఁ జుమీ మీఁదటన్ (211-213)
శాస్త్రాలన్ని చదివి, అధర్మము పట్ల భీతితో రాజశాసనాన్ని విధిగా అనుసరించేవాడు, వయస్సు 50-70 మధ్య ఉండి, వంశపారంపర్యంగా వచ్చే రోగాలు లేనివాడై, నిగర్వియైనవాడు, రాజు ప్రార్థిస్తేనే అమాత్యపదవిని ఒప్పుకునే బ్రాహ్మణుడు లభిస్తే అతని ద్వారా రాజ్యాంగాలను బలిష్టం చెయ్యడానికి ఒక్కపూట చాలదా?
ఒకవేళ అటువంటి మంత్రివర్గము దొరకకపోతే - నీతిని తానే యోచించి అమలుపరచాలి. తనకంటే గొప్పవాడు కదా అని ఎవడినో ఒకడిని నియమిస్తే, గుమ్మడికాయంత ముత్యాన్ని ధరించిన వాడు మోయలేక బాధ పడినట్లు తాను బాధ పడక తప్పదు.
చేయునది రాజ్యమఁట యఘ
మే యవధిగ నీగువారమే మనఁ జన దా
మ్నాయంబు నశక్యాను
ష్ఠేయముఁ జెప్పదు స్వశక్తిఁ జేయుగఁ జెప్పన్ (284)
రాజ్యమేలడానికి పాపపు పనులు చేయాల్సి వస్తుందని గాని, ఆ పాపాల నుండి బయటపడలేమని గానీ తలపకూడదు. వేదశాస్త్రాలు సాధ్యంకాని ధర్మాన్ని విధింపవు. నీ శక్త్యనుసారంగా ధర్మాన్ని ఆచరించమనే అవి చెబుతాయి.
ఉపసంహారం
ఆముక్తమాల్యద రాజనీతి విభాగంలో ఒక రకమైన వైరుధ్యం మనకు కనబడుతుంది: ఒక పక్క రాజతంత్రత గురించి లౌకిక పరమైన రాజనీతిని బోధిస్తూనే మరో పక్క పారమార్థికతను ఉగ్గడిస్తూ రాజ్యాన్ని, రాజభోగాలను త్యజించడమే రాజు యొక్క పరమావధి అని ఉపదేశించడం మనకు కనిపిస్తుంది. అయితే, శ్రీవైష్ణవ తత్త్వాన్ని రాజనీతికి కూడా వర్తింపజేస్తే ఈ రకమైన వైరుధ్యాన్ని తేలికగానే వివరించవచ్చు. శ్రీవైష్ణవ సిద్ధాంతాల ప్రకారం సృష్టి అంతా పరమేశ్వరుని భోగ స్థానమే. అందుచేత రాజరికాన్ని ఒక సామాజిక ధర్మంగా, మోక్షసాధనను ఒక వైయుక్తిక ధర్మంగా వేరుచేసి చూడాలి. రాజు తన జీవితకాలంలో ఎప్పుడో ఒకప్పుడు రాజభోగాలను త్యజించి సన్యసించాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఆముక్తమాల్యద కావ్యంలో ఈ రకమైన దృక్పథానికి వ్యతిరేకత కనిపించక పోగా, యోగులైన రాజుల పట్ల అమితమైన ఆరాధనా భావం కనిపిస్తుంది. అంతమాత్రం చేత రాజరికపు సమస్యలకు సన్యాస యోగమే సమాధానమని ఈ కావ్యంలో ఎక్కడా చెప్పలేదు. కాంటరోవిట్జ్ (Ernst Kantorowicz)చెప్పిన ద్విదేహ సిద్ధాంతం ఇక్కడ ప్రతిపాదించాడని చెప్పడానికి ఆస్కారం లేకున్నా, శ్రీవైష్ణమతానుసారమైన ఇహలోక వాస్తవతత్త్వం ప్రాధాన్యత సంతరించుకొని, రాజు తన ధర్మాలను విడనాడి భక్తి వైరాగ్యాల దారి పట్టకుండా ఆపుతుంది.కృష్ణదేవరాయల రాజనీతి ప్రభావం తన తరువాతి విజయనగర రాజలపైనే కాక ఇతర సామ్రాజ్యాలపై ఉందని చెప్పుకోవచ్చు. మొగల్ కవి అబుల్ ఫైజ్ రాసిన నల దమయంతి చరిత్రలో కూడా ఇదే విధమైన రాజనీతి చర్చ కనబడడం యాదృచ్ఛికం కాకపోవచ్చును. అలాగని అబుల్ ఫైజ్‌కు ఆముక్తమాల్యదతో పరిచయం ఉందని చెప్పలేము. ప్రస్తుతానికి కృష్ణదేవరాయలు చర్చించిన రాజనీతి సమస్యలు మధ్యయుగంలో అమిత ప్రాధాన్యత సంతరించుకున్నాయని, ఆనాటి రాజకీయ, సామాజిక, తాత్విక చింతనను ఆముక్తమాల్యద ఒక కళాత్మకమైన రూపంగా మనకు అందిస్తుందని మాత్రం చెప్పుకోవచ్చు.
No comments:
Post a Comment