రాముడు రాతిని నాతిని చేసినట్టు, అతడి చేయి పడితే ఎందుకూ పనికి రాని వస్తువులు కూడా అమూల్యమైన వైజ్ఞానిక బోధనా పరికరాలుగా మారిపోతాయి. వాడేసిన అగ్గిపుల్లలు, పాత న్యూస్ పేపర్లు, వాడిన టెట్రాపాక్ డబ్బాలు, పాడైపోయిన సైకిల్ టైర్లు, పారేసిన ప్లాస్టిక్ సీసాలు.. కావేవీ చదువు కనర్హం అని అతడి ఉద్దేశం. దైనందిన జీవితంలో మన చుట్టూ కనిపించే అతి సామాన్యమైన వస్తువులతో కూడా ఏదో సృజనాత్మకమైన ప్రయోగం చేసి సైన్సు అంటే పిల్లల్లో వల్లమాలిన అభిమానాన్ని పెంచగల చాతుర్యం తనది. అతడి పేరు అరవింద్ గుప్తా.