తాఫం కారణంగా పెరిగిన సముద్రపు మట్టంవల్ల తీరం తరిగిపోయినప్పుడు, వరదలవల్ల నేల జలమయం
అయినప్పుడు, అగ్నిపర్వతాల వల్లనో, భూకంపాల వల్లనో నేల చిన్నాభిన్నమైనప్పుడు భూభాగం తగ్గిపోతుంది. విస్తీర్ణత తక్కువగా ఉన్న దేశాల విషయంలో ప్రకృతి విలయతాండవంవల్ల భూభాగం తగ్గిపోవడం నిజంగా గడ్డు సమస్యే అవుతుంది. కనుక నేల లేనిచోట, అంటే నీటి మీదనో, నీటిలోనో, ఆకాశంలోనో ఇళ్ళు, ఊళ్ళు కట్టుకుని నేలలేని వెలితి తీర్చుకోవాలన్న ఆలోచన ఎంతకాలంగానో ఉంది.
విస్తీర్ణత తక్కువై, జనాభా ఎక్కువైన జపాన్‌లో అలా నీటిపైతేలే నగరాల నిర్మాణం గురించి ఎంతకాలంగానో సన్నాహం జరుగుతోంది. ప్రస్తుతం ప్రపంచంలోకెల్ల అతి పొడవైన బుర్జ్ ఖలీపా భవనం కన్నా ఎతె్తైన కిలోమీటర్ పొడవున్న భవనాన్ని నిర్మించాలని జపాన్‌కి చెందిన కొందరు శాస్తవ్రేత్తలు, ఇంజినీర్లు, వ్యాపారవేత్తలు కలిసిన బృందం ప్రయత్నిస్తోంది. ఓ పొడవాటి తామర తూడు కొసలో వికసించే అరవిందంలా, ఓ పొడవాటి స్తంభం మీద ఓ విశాలమైన నగరం నిర్మించబడుతుంది. దానికి ఆకాశపట్టణం (సిటీ ఇన్ ద స్కై) అని పేరు పెట్టారు. ఆ స్తంభం ఓ విశాలమైన (వ్యాసం మూడు కిలోమీటర్లు) వేదిక మీద ‘తామరాకు’లా నీటిపై తేలే ఓ విశావలమైన పడవమీద నిలబడుతుందిట. ఆ ఆకాశనగరంలో 30,000వేల మంది నివసించగలరని అంచనా. ఎత్తుమీద నివసించడానికి ఇష్టపడని వారికి అడుగున ‘తామరాకు’ వేదిక మీద నివాసాలు ఉంటాయి. ఇక్కడ 10,000 మంది దాకా జీవించగలరట. ఈ వింత నగరపు నిర్మాణంలో అతి తేలికైన మిశ్రమలోహాలు వాడడం జరుగుతుందని, దీన్ని నిర్మించటానికి పూనుకున్న జపనీస్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ షిమిజు అంటోంది. పైన వర్ణించబడ్డ నగరం నీటిపై తేలే నగరమే కాన అది కదలకుండా నిశ్చలంగా ఉంటుంది. అలా కాకుండా నీటిపై కదలే ఓడలాండి నగరాన్ని నిర్మించడానికి కూడా సన్నాహం జరుగుతోంది. ఆ ఓడ పేరు ‘స్వేచ్ఛ’. ఇరవైఐదు అంతస్థుల ఎత్తున్న భవనాలు వరుసగా మైలు పొడవున ఉంటే ఎలా ఉంటుందో ఆ ఓడ అలా ఉంటుంది. 1,317 మీటర్ల పొడవు, 221 మీటర్ల వెడల్పు, 103 మీటర్ల ఎత్తు ఉన్న ఈ ఓడ ముందు ఇక మామూలు నౌకలు మరుగుజ్జుల్లా ఉంటాయి. గాలి చొరబడని పెద్ద పెద్ద స్టీలు పెట్టెలతో ఈ ఓడకి పునాదిని నిర్మిస్తారు. ఒక్కొక్క పెట్టె 80 అడుగుల (24 మీటర్ల) ఎత్తు, 50 నుండి 100 అడుగుల (5 నుండి 30 మీటర్ల) వెడల్పు, 50 నుండి 120 అడుగుల (15 నుం 37 మీటర్ల) పొడవు ఉంటుంది. ఇలాంటి ఎన్నో పెట్టెలని కలిపి ఇంకా పెద్ద పెట్టెలని తయారు చేస్తారు. ఈ పెద్ద పెట్టెలతోనే మైలు పొడవున్న ఓడ యొక్క పునాది నిర్మిస్తారు. అసలు పని అంటూ మొదలైతే ఈ ఓడ నిర్మాణం మూడేళ్ళల్లో పూర్తవుతుందని ఈ భవనానికి మూలపురుషుడైన నార్మన్ నిక్సన్ అంటాడు.అంత పెద్ద నిర్మణాన్ని నీటిమీద ముందుకు నెట్టాలంటే చాలా శక్తి కావాలి. ఓడని చోదించడానికి నూరు పెద్ద డీసిల్ ఇంజెన్లు కావాలని ఒక్కొక్క దానికి మూడువేల హార్స్ పవర్ పైగా బలం ఉండాలని ఈ ప్రాజెక్టు ఇంజనీర్లు అంటున్నారు. ఈ మెగా ఇంజిన్ల ఖరీదు ఒక్కొక్క దానికి మిలియన్ డాలర్లు అవుతుందట. ఈ లెక్కన మొత్తం ఓడ నిర్మాణానికి అయ్యే ఖర్చు ఆకాశాన్నంటుతుందని వేరే చెప్పనక్కర లేదు. ఆ సొమ్మంతా ఓడలో రియల్ ఎస్టేట్ కొనుక్కునే అదృష్టవంతుల నుండి రాబట్టొచ్చని ప్రాజెక్ట్ నిర్మాతల ధీమా. ఈ సముద్ర నగరంలో ఒక్కొక్క ప్లాట్ ఖరీదు పదకొండు మిలియన్ల డాలర్లు మరి!