Friday, January 28, 2011

కొలమాన పద్ధతులు

దృక్పథంలో కొంత మార్పు వచ్చినా రసాయన విజ్ఞానం మాత్రం తక్కిన వైజ్ఞానిక రంగాలతో పోల్చితే కొంత వెనకబడి ఉందనే చెప్పుకోవాలి.



ఖగోళవిజ్ఞానాన్నే తీసుకుంటే సంఖ్యాత్మకమైన కొలమానం, గణితపద్ధతుల వినియోగం మొదలైనవి ఎంత ముఖ్యమో మనుషులు ప్రాచీన కాలం నుండే అర్థం చేసుకున్నారు. దానికి కారణం ఒకటి కావచ్చు. ప్రాచీన కాలంలో మనుషులు తలపడ్డ ఖగోళ సమస్యలు అంత కఠినమైనవేమీ కావు. కాస్తంత తల జ్యామితిని ప్రయోగిస్తే తేలిగ్గా తెగే సమస్యలవి.


భౌతిక శాస్త్రంలో గణితం యొక్క వినియోగం, కచ్చితమైన కొలమానం అనే పద్ధతులకి ఊపిరి పోసినవాడు ఇటాలియన్ వైజ్ఞానికుడు గెలీలియో గెలీలీ (1564-1642). 1590 ల దరిదాపుల్లో ఇతడు కింద పడే వస్తువుల మీద పరిశోధనలు చేశాడు. ఆ ప్రయోగ ఫలితాలే తదనంతరం ఐజాక్ న్యూటన్ (1642-1727) అనే ఇంగ్లీష్ శాస్త్రవేత్త చేసిన సైద్ధాంతిక శోధనలకి ఊతనిచ్చాయి. 1687 లో ప్రచురితమైన ప్రిన్సిపియా మాథమాటికా అనే పుస్తకంలో న్యూటన్ మూడు చలన నియమాలని ప్రతిపాదించాడు. రెండు శతాబ్దాల పాటు ఈ నియమాలు యాంత్రిక శాస్త్రానికి (mechanics) పునాదులు అయ్యాయి. అదే పుస్తకంలో న్యూటన్ తన గురుత్వ సిద్ధాంతాన్ని కూడా ప్రతిపాదించాడు. ఈ సిద్ధాంతం కూడా రెండు శతాబ్దాల పాటు విశ్వచలనాలని విజయవంతంగా వర్ణించగలిగింది. మానం సాధించగల వాస్తవ వేగాల వద్ద ఇప్పటికీ ఈ సిద్ధాంతం కచ్చితంగానే పనిచేస్తోంది. ఈ సిద్ధాంత నిర్మాణం కోసం న్యూటన్ క్యాక్లులస్ అనే ఓ కొత్త గణిత విభాగాన్ని రూపొందించి గ్రహ చలనాల శోధనలో ఆ గణితాన్ని అద్భుతంగా వినియోగించాడు.

న్యూటన్ విజయాలతో వైజ్ఞానిక విప్లవం పరాకాష్టని చేరుకుంది. ఇక ఆ నాటి నుండి ప్రాచీన గ్రీకుల పట్ల, లేదా ఇతర ప్రాచీన సంస్కృతుల పట్ల అచంచల భక్తి పూర్తిగా మాయమయ్యింది. వైజ్ఞానిక విషయాలలో ప్రాచీన గ్రీకులని మించిపోయింది అర్వాచీన పాశ్చాత్య యూరప్. ఇక సమర్ధన కోసం గతం వైపు చూసుకునే అవసరం లేకపోయింది.

No comments: