Saturday, December 22, 2012

ఖర్జూరాలతో కలిగే మరిన్ని ప్రయోజనాలివి...


ఖర్జూరాలతో కలిగే మరిన్ని ప్రయోజనాలివి...

ఖర్జూరాల్లో ఉన్న పోషకాలు, అవి చేసే మేలు ఇంత అని చెప్పలేం. ఇందులో ఫ్రక్టోజ్, డెక్స్‌ట్రోజ్ అనే చక్కెర పదార్థాలు ఎక్కువగా ఉండటం వల్ల కొన్ని తిన్న వెంటనే తక్షణం శరీరంలోకి ఎంతో శక్తి విడుదలవుతుంది. ఖర్జూరాలతో కలిగే మరిన్ని ప్రయోజనాలివి... 

ఖర్జూరాల్లో పీచుపదార్థం (డయటరీ ఫైబర్) చాలా ఎక్కువ. మనం చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్) ఎక్కువగా తీసుకున్నప్పుడు ఖర్జూరాలు తింటే... ఇందులోని పీచుపదార్థాలు ఈ చెడుకొలెస్ట్రాల్‌కు అడ్డుపడి శరీరంలో ఇంకకుండా చూస్తాయి. దాంతోపాటు తేలిగ్గా మలవిసర్జన కావడం జరుగుతాయి. 

ఖర్జూరాల్లో ఉండే టానిన్స్ అని పిలిచే ఫ్లేవనాయిడ్ పాలీఫీనాలిక్ యాంటీ ఆక్సిడెంట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి శరీరంలో ఇన్ఫెక్షన్లను, మంట, వాపు వంటివి కలగడాన్ని (ఇన్‌ఫ్లమేషన్‌ను), రక్తస్రావాలను నివారిస్తాయి. 

ఖర్జూరాల్లో ఉండే బీటా-కెరోటిన్, ల్యూటిన్, జీ-గ్జాంథిన్ అనే యాంటీఆక్సిడెంట్స్ మన శరీరంలోని అన్ని కణాలను సంరక్షిస్తాయి. పై పోషకాలు పెద్దపేగు, ప్రోస్టేట్, రొమ్ము, ఎండోమెట్రియల్, ఊపిరితిత్తులు, ప్యాంక్రియాస్ క్యాన్సర్లను నిరోధిస్తాయి. 

జీ-గ్జాంథిన్ అనే పోషకం మన కంటి రెటినాలోకి శోషితమై కంటిని సంరక్షిస్తుంటుంది. వయసు పెరగడం వల్ల కన్ను సామర్థ్యం తగ్గడాన్ని ఈ పోషకం నివారిస్తుంది. 

ఖర్జూరాల గురించి ముఖ్యంగా చెప్పాల్సింది... మన దేశంలోని మహిళలు వీలైనంత ఎక్కువగా దీన్ని వాడటం మంచిది. ఎందుకంటే మన దేశంలోని 85 శాతం యుక్తవయసున్న మహిళల్లో రక్తహీనత ఉంటుంది. ప్రతి 100 గ్రాముల ఖర్జూరాల్లో 0.90 మి.గ్రా. ఐరన్ ఉంటుంది. దాంతో ఖర్జూరాలు క్రమం తప్పకుండా తినేవారికి రక్తహీనత తగ్గుతుంది. అందుకే మహిళలు తాము తినే చిరుతిండ్లలో దీన్ని భాగం చేసుకోవడం చాలా మేలు. 

ఇందులో పొటాషియమ్ పాళ్లూ ఎక్కువే. 100 గ్రా. ఖర్జూరాల్లో 696 మి.గ్రా. పొటాషియమ్ ఉంటుంది. పొటాషియమ్ రక్తపోటును సమర్థంగా నివారిస్తుంది కాబట్టి హైబీపీ ఉన్నవారు వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల గుండెజబ్బులు (కరొనరీ హార్ట్ డిసీజెస్), పక్షవాతం వంటి వాటిని నివారించవచ్చు. 

No comments: