నీలాకాశంలో భారులు తీరి.. తీరైన చాపాల్లా ఎగిరే పలువనె్నల పులుగులని చూస్తే కవి హృదయంలో కవిత పెల్లుబుకుతుందేమో గాని, శాస్తవ్రేత్త మెదడులో ఏవో ఆలోచనలు చెలరేగి కలవరపెడతాయి. ‘ఎయిర్ షో’లో యుద్ధ విమానాలు చిత్రవిచిత్రమైన విన్యాసాలలో ఏర్పడి ఎగరగలిగాయంటే అవి అధునాతన సమాచార సాధనాలని వాడుకుంటాయి. మరి చక్కని చాపాలలో ఎగిరే పక్షులు ఎలాంటి సమాచారాన్ని పంచుకుంటున్నాయి? ఏం మాట్లాడుకుంటున్నాయి?
1986లో సరిగ్గా అలాంటి ఆలచోనలే క్రెయిగ్ రెనాల్డ్స్‌ని కలవరపెట్టాయి. క్రెయిగ్ అమెరికాకి చెందిన ఓ ఏనిమేటర్. ఏనిమేషన్ చిత్రాలలో, ముఖ్యంగా జంతువుల కథలకి సంబంధించిన చిత్రాలలో, కొన్ని సందర్భాలలో ఆకాశంలో పక్షులు ఎగురుతున్నట్టు చూపించాలి. అవి ఎగిరే తీరు ఎంత సహజంగా ఉంటే చూడడానికి అంత అందంగా ఉంటుంది. అంతకు పూర్వం చలామణిలో ఉండే ఏనిమేషన్ పద్ధతుల్లో ప్రతీపాత్ర యొక్క చేష్టలని కచ్చితంగా ముందే నిర్ణయించి ప్రోగ్రాం చేసి, పాత్రని ఏనిమేట్ చెయ్యాల్సి వచ్చేది. కాని క్రెయిగ్ రెనాల్డ్స్ ఓ కొత్తపంథా ఎంచుకున్నాడు. నిజ జీవితంలో లాగానే ప్రతీ పాత్ర తనతోటి చేష్టలకి స్పందిస్తూ తన సొంత చేష్టలని సవరించుకుంటూ ఉంటే మరింత సహజంగా ఉంటుంది అనిపించింది తనకి. అలాంటి పాత్రలని ‘‘తమని తామే ఆడించుకునే తోలుబొమ్మలు’’ అని వర్ణిస్తుంది ఏన్‌మారియాన్ అనే ఏనిమేషన్ నిపుణురాలు. ఇలాంటి ఏనిమేషన్ పద్ధతిని ప్రవర్తనాత్మక ఏనిమేషన్ (behavioral animation) అంటారు.
ఈ కొత్త పద్ధతిలో గుంపులుగా ఎగిరే పక్షులని ఏనిమేట్ చెయ్యాలనుకున్నాడు క్రెయిగ్. ఎలాంటి నియమాలని అనుసరించి పక్షులు ఎగురుతుంటాయో ఆలోచించాడు. అందుకు పోలికగా ట్రాఫిక్ సాఫీగా సాగడానికి డ్రయివర్లు ఎలాంటి నియమాలు పాటిస్తే బావుంటుందో ఓసారి పరిశీలించాలి. ఒక ముఖ్యమైన సూత్రం ఏంటంటే మన వాహనం పొరుగు వాహనాలకి మరీ దగ్గరిగా వెళ్ళకూడదు. ఇది మొదటి నియమం. వాహనాలన్నీ ఒకే దిశలో అంటే ముందుకే కదలాలి. వేగంగా ముందుకు పోవాలని ఆత్రుతపడి అటు ఇటూ ‘కోస్తే’, ట్రాఫిక్ మందగిస్తుంది. అలాగే వాహనానికి వాహనానికి మధ్య దూరం మరీ ఎక్కువ ఉండకుండా చూసుకోవాలి. దూరం మరీ ఎక్కువ అయితే రోడ్డుమీద ఉన్న స్థలాన్ని పొదుపుగా వాడుకోనట్టు అవుతుంది. ఇలాంటి పరిశీలనల ఆధారంగా క్రెయిగ్ పక్షుల గమన విధానాన్ని వర్ణించే మూడు సూత్రాలని ప్రతిపాదించాడు.
1. వేర్పాటు (Seperation) - ప్రతీ పక్షి తన పొరుగు పక్షుల నుండి కొంత కనీస దూరం ఉండేలా ఎగరాలి.
2. సమరేఖనం (Alignment) - ఫ్రతీ పక్షి తన పొరుగు పక్షులు ఎగురుతున్న దిశలోనే ఎగరడానికి ప్రయత్నించాలి.
3. సంసంజనం (Cohesion) - ప్రతీ పక్షి తన పొరుగు పక్షుల సగటు స్థానానికి దగ్గరగా ఉండేలా ఎగరాలి.
పై సూత్రాలలో ఒకటి, మూడు పరస్పర విరుద్ధంగా ఉన్నట్టు అనిపించొచ్చు. అంటే ప్రతీ పక్షి తన పొరుగు పక్షులకి మరీ దగ్గర కాకుండా మరీ దూరమూ కాకుండా ఎగరాలన్నమాట. అయితే పై సూత్రాలు ప్రాథమిక సూత్రాలు మాత్రమే. మరింత వాస్తవ పరిస్థితుల్లో మరిన్ని నియమాలని పాటించాల్సి వస్తుంది. ఉదాహరణకి పక్షులన్నీ పై నియమాలని అనుసరిస్తూ ఓ లక్ష్యం దిక్కుగా ఎలా పయనిస్తాయి? మధ్య చెట్లు, రాళ్ళు మొదలైన అవరోధాలు ఎదురైతే వాటిని తప్పుకుని ఎలా ముందుకు పోతాయి? ఇలాంటి సూత్రాలన్నీ పొందుపరిచి క్రెయిగ్ రెనాల్డ్స్ తన సహోద్యోగులతో కలిసి ‘స్టాన్లీ అండ్ స్టెల్లా ఇన్ బ్రేకింగ్ ద ఐస్’’ అనే ఓ చిన్న ఏనిమేషన్ చిత్రాన్ని రూపొందించారు. ఈ కొత్త ఏనిమేషన్ పద్ధతి గురించి 1987లో ప్రఖ్యాత అంతర్జాతీయ కంప్యూటర్ సైన్స్ సమావేశం అయిన ‘సిగ్ గ్రాఫ్’లో క్రెయిగ్ తదితరులు ఓ పరిశోధనా పత్రాన్ని చదివారు. ఈ కృత్రిమ కంప్యూటర్ పక్షులకి ‘బాయిడ్’లని (boids) పేరు పెట్టారు. తదనంతరం ఈ కొత్త ప్రవర్తనాత్మక ఏనిమేషన్ పద్ధతి ఎన్నో సినిమాల్లో వాడబడింది. 1992లో వచ్చిన ‘బ్యాట్ మాన్ రిటర్న్స్’ చిత్రంలో ఎగిరే గబ్బిలాల గుంపుని ఈ విధంగానే చిత్రీకరించారు. వినోదం కోసమే కాకుండా ఈ బాయిడ్‌లకి శాస్ర్తియ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. జంతు జాతులు సమష్టిగా ఎలా బతుకుతాయి. ఎలా కదులుతాయి. ఎలా పరిణామం చెందుతాయి. మొదలైన ప్రశ్నలకి సమాధానాలని కంప్యూటర్ నమూనాలతో శోధించే ‘కృత్రిమ జీవనం’ (Artificial life) అనే రంగంలో కూడా ఈ బాయిడ్లు చోటు చేసుకున్నాయి. ఇక దైనిక జీవన ప్రయోజనాల విషయానికి వస్తే ఈ పక్షులని చూసైనా స్ఫూర్తి తెచ్చుకొని మన మానవ డ్రయివర్లు మరింత సనాగరికంగా, సహేతుకంగా, సామరస్యంగా వాహనాలు నడిపిస్తారేమోనని ఓ చిన్న ఆశ.
No comments:
Post a Comment