Thursday, March 31, 2011

నైట్రోజెన్ ని కనుక్కున్న రూథర్ ఫర్డ్

కార్బన్ డయాక్సయిడ్ తో తన ప్రయోగాలు కొనసాగించాడు బ్లాక్. కొవ్వొత్తి కార్బన్ డయాక్సయిడ్ లో మండదని మొదట కనుక్కున్నాడు. మూసిన పాత్రలో మండే కొవ్వొత్తిని ఉంచితే అది కాసేపు అయ్యాక ఆరిపోతుంది. ఆ తరువాత పాత్రలో మిగిలిన గాలి జ్వలన క్రియని పోషించలేకపోతుంది. జ్వలనం వల్ల ఏర్పడ్డ కార్బన్ డయాక్సయిడే దానికి కారణం అన్నట్టు అనిపించింది. అయితే పాత్రలో మిగిలిన గాలి నుండి రసాయనాల సహాయంతో కార్బన్ డయాక్సయిడ్ ని తొలగించినా కూడా కొంత గాలి మిగిలిపోవడం కనిపించింది. కార్బన్ డయాక్సయిడ్ ని తొలగించినా మిగిలిన వాయువు కూడా జ్వలనాన్ని పోషించదని అర్థమయ్యింది.


ఈ కొత్త సమస్యని ఎలా ఛేదించాలో అర్థంగాని బ్లాక్ దాన్ని తన శిష్యుడైన స్కాటిష్ రసాయనికుడు డేనియల్ రూథర్ ఫర్డ్ కి (1742-1819) సమస్యని అప్పజెప్పాడు. మూసిన పాత్రలో ఉంచిన ఎలుక కాసేపయ్యాక ప్రాణాలు విడుస్తుందని గమనించాడు. ఎలుక మరణించిన పాత్రలో కొవ్వొత్తిని మండించి, దాన్ని వీలైనంత వరకు మండనిచ్చాడు. అలా మిగిలిన గాలిలో ఫాస్ఫరస్ ని కూడా సాధ్యమైనంతవరకు మండనిచ్చాడు. ఇంకా పాత్రలో మిగిలిన గాలిని కార్బన్ డయాక్సయిడ్ ని పీల్చుకునే ద్రావకం లోంచి పోనిచ్చాడు. ఇన్ని సంస్కారాలు చేశాక మిగిలిన గాలి కూడా జ్వలనక్రియని పోషించలేకపోయింది. అందులో కూడా ఎలుక బతకలేక పోయింది. కొవ్వొత్తి మండలేకపోయింది.

1772 లో రూథర్ ఫర్డ్ తన ప్రయోగ ఫలితాలని ప్రకటించాడు. రూథర్ ఫర్డ్ కూడా, బ్లాక్ లాగానే ఫ్లాగిస్టాన్ సిద్ధాంతాన్ని గుడ్డిగా నమ్మేవాడు. కనుక ఇద్దరూ ఈ సిద్ధాంతాన్ని ఉపయోగించి తమ ప్రయోగాలని వివరించడానికి ప్రయత్నించారు. ఎలుకలు ఊపిరి తీసుకుంటున్నప్పుడు, కొవ్వొత్తి వెలుగుతునప్పుడు, ఫాస్ఫరస్ మండుతున్నప్పుడు, ఏర్పడే కార్బన్ డయాక్సయిడ్ తో పాటు కొంత ఫ్లాగిస్టాన్ కూడా వెలువడుతుంది. తదనంతరం కార్బన్ డయాక్సయిడ్ తొలగించబడ్డా మిగిలిన గాలిలో ఎంతో ఫ్లాగిస్టాన్ ఉండిపోతుంది. నిజానికి అందులో ఎంత ఫ్లాగిస్టాన్ ఉంటుందంటే, అది మరింత ఫ్లాగిస్టాన్ ని స్వీకరించలేకపోతుంది. (అది ఫ్లాగిస్టాన్ తో సంతృప్తం (saturate) అయిపోతుంది). అందుకే అందులో ఒక దశ తరువాత వస్తువులు మండలేకపోతాయి.

అలా మిగిలిన గాలికి రూథర్ ఫర్డ్ “ఫ్లాగిస్టికీకృత గాలి” అని పేరు పెట్టాడు. ఆ గాలినే ప్రస్తుతం మనం నైట్రోజెన్ అంటాం. ఆ గాలిని కనుక్కున్న ఘనత రూథర్ ఫర్డ్ కిస్తున్నాం.

No comments: