ఆస్తమా వ్యాధి శ్వాసకోశ వ్యాధుల్లో ఒక ముఖ్యమైన వ్యాధి అని చెప్పుకోవచ్చు.వివిధ దేశాల్లో ఈ వ్యాధికి గురవుతున్నవారికి సంఖ్య 5 శాతం నుండి 10శాతం వరకు ఉంటుంది. చెస్ట్ క్లినిక్‌లలో ఈ వ్యాధితో వచ్చే వారి సంఖ్య కనీసం 50 వరకు ఉంటుంది. భారతదేశంలో ఆస్తమా వ్యాధితో బాధపడేవారి సంఖ్యను గురించి కొన్ని అధ్యయనాలు జరిగారుు. ఈ అధ్యయనాలల్లో 3 నుంచి 4 శాతం జనాభాలో ఆస్తమా ఉన్నట్లుగా గుర్తించారు. అంటే ప్రస్తుతం మన జనాభాలో 3 నుంచి 4 కోట్ల ఆస్తమా వ్యాధిగ్రస్థులు ఉన్నారని అర్థం.
పెరుగుతున్న పారిశ్రామీకరణ, ఆహారపుటలవాట్లు, వాయుకాలుష్యం వల్ల ఆస్తమాతో బాధపడేవారి సంఖ్య మున్ముందు 10 కోట్లకు చేరవచ్చని అంచనా. కొన్ని అధ్యయనాల్లో ఎవరు ఆస్తమా వ్యాధితో బాధపడే అవకాశాలు ఉన్నాయో పరిశీలించడం జరిగింది. వీటి ప్రకారం పట్టణప్రాంత వాసులకు, మహిళలకు, పెద్ద వయస్సు వారికి ఎలర్జీ లక్షణం ఉన్నవారికి, ధుమపానం చేసేవారికి, ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన వారికి, వంశలో ఆస్తమా ఉన్నవారికి ఆస్తమా వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తేలింది.
దీర్ఘకాలంగా ఇబ్బందులకు గురిచేసే ఈ వ్యాధిని అందుబాటులో ఉన్న ఆధునిక వైద్య చికిత్సతతో అదుపులో పెట్టుకొని వీలైనంతా సాధారణ జీవనాన్ని గడిపే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ వ్యాధి గురించిన, నూతన చికిత్సా పద్ధతులగురించి అవగాహన మనకు ఎంతైనా అవసరం. గ్లోబల్ ఇనిషియేటివ్ ఆన్ ఆస్త మా సంస్థ ప్రతి ఏటా మే నెల మొదటి మంగళవారాన్ని ప్రపంచ ఆస్తమా దినోత్సవంగా జరుపుతుంది. ఆస్తమా గురించిన పూర్తి సమాచారాన్ని సైతం అందరికి అందుబాటులో ఉంచుతుంది. ‘ఆస్తమా’ జబ్బు అనగానే చాలా మంది దిగులు పడిపోతారు.
జీవితాంతం ఈ జబ్బుతో బాధపడుతూ ఉండాలి. ప్రాణం ఏ క్షణాన్న పోతుందో ఏమో అన్నంత ఆందోళన వీరికి ఉంటుంది. ఈ జబ్బుతో జీవించడం చాలా కష్టం అనేది ఒకప్పటి మాట. ప్రస్తుతం ఈ వ్యాధిని పూర్తిగా అదుపులో ఉంచడమే కాకుండా వ్యాధి రాకుండా నివారించేందుకు కూడా మందులు అందుబాటులో ఉన్నాయి. గత30 సంవత్సరాలుగా ఈ వ్యాధిని గురించి సరియైన అవగాహన ఉండడమే దీనికి కారణం.అతి తక్కువ మందును నేరుగా శ్వాసనాళాలలోకి పంపించే నూతన పద్ధతుల ద్వారా కూడా ఇది సాధ్యమవుతుంది.
ఆస్తమా ఎందుకు వస్తుంది?
ఆస్తమా వ్యాధి ఎలర్జీకి సంబంధించినది. ఇలాంటి వారిలో వ్యాధి నిరోధక శక్తిని కలిగించే ......యాంటిబాడీ ఎక్కువగా ఉంటుంది. ఇది వంశపారంపర్యంగా సంక్రమించవచ్చు. దీనినే ఎటోపి అంటారు. అయితే ఎటోపి లక్షణం ఉండే అందరిలో ఎలర్జీకానీ, ఆస్తమా కానీ రావాలని లేదు. అలాగే ఎటోపి లక్షణం లేని కొంతమందిలో కూడా ఈ జబ్బు రావచ్చు. శరీరానికి సరిపడని యాంటిజెన్‌లు శరీరంలోకి ప్రవేశించినపుడు ఈ వ్యాధి నిరోధక శక్తి కలిగి ఉండే యాంటిబాడి వెలువడి శరీరాన్ని రక్షించే యత్నం చేస్తాయి.
ఈప్రక్రియలో కణాలనుండి ఉత్పత్తి అయ్యే వివిధ రసాయనాల వల్ల శ్వాసనాళాల్లో శ్లేష్మం జమ అవటం, తద్వారా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. దీని వల్ల దగ్గు, ఆయాసం, పిల్లికూత, ఛాతీపట్టేసినట్టు ఉండటం జరుగుతుంది. ఈ లక్షణాలతో పాటు కొంత మందిలో తరచుగా తుమ్ములు, ముక్కు దిబ్బడేయడం, నీరు కారటం, కంట్లో దురద, చర్మంపై దద్దుర్లు ఎలర్జిక్ డెర్మటైటిస్, ఎక్జి మా, లాంటి చర్మవ్యాధులు వస్తాయి. అయితే ఎలర్జీ వల్ల వచ్చే ఈ వ్యాధులన్నీ ఒకరిలోనే కనిపించవచ్చు. లేదా ఒకటి, రెండు లక్షణాలు మాత్రమే ఉండవచ్చు.
ఆస్తమా వేటి వలన వస్తుంది?
సాధారణంగా దుమ్ము, ధూళి, డస్ట్‌మైట్, పుప్పొడి, పొగ, చలిగాలి, వైరస్, వ్యాయామం, ఉద్వేగం మొదలైనటువంటి వాటి వలన ఆస్తమా వస్తుం ది. శ్వాస నాళాల్లోకి నేరుగా వెళ్ళే ఏరో ఎలర్జెన్స్ ఆస్తమా వ్యా ధిని కలిగించడంలో ప్రధాన పాత్ర కలిగి ఉండడం గమనించదగ్గ విషయం. ఆహారం వల్ల ఆస్తమా రావడం బహుకొద్దిమందిలోనే జరుగుతుంది.చాలా మందిలో ఆస్తమా జలుబుతో మొదలయ్యి తరువాత గొంతునొప్పి, గొంతులో నసగా ఉండడం, స్వరం మారడం జరుగుతుంది. దాని తరువాత దగ్గు, ఆయాసం, పిల్లి కూతగా మారుతుంది.
వీరిలో సాధారణం్ఠగా యాంటీబయాటిక్స్ గాని, యాంటి హిస్టమిన్స్ కాని పని చేయవు. చలిగాలి పీల్చినప్పుడు గాని, పొగ, గాఢమైన వాసనవల్ల కాని వీరిలో దగ్గు ఎక్కువ అవుతుంది. రాత్రిళ్ళు దగ్గు ఆయాసం ఎక్కువగా ఉండటం మూలాన వీరికి సరిగా నిద్ర పట్టదు. శ్వాస సరిగా అందక గాలికోసం నిద్ర నుండి లేచి కూర్చోవటం, ఫాన్ ఎక్కువగా వేసుకోవటం, కిటికీ దగ్గర కూర్చోవడం చేస్తుంటారు.కొంతమందిలో నిద్రకు వెళ్ళే ముందు ఈ లక్షణాలన్నీ లేకున్నా ఉదయం మూడు గంటల నుండి ఆరు గంటల మధ్య దగ్గు, ఆయాసం ఎక్కువై నిద్ర నుండి లేవాల్సి వస్తుంది. 24 గంటల్లో ఉదయం 3 నుండి 6 గంటల వరకు చలి అధికంగా ఉండడమే దీనికి కారణం. ఇలా రాత్రి ళ్ళు మాత్రమే ఆస్తమా ఉంటే దాన్ని నాక్టర్నల్ ఆస్తమా అంటారు.
వ్యాయామం చేస్తున్నపుడు లేదా ఆటలు ఆడుతున్నప్పుడు మాత్రమే కొంతమందిలో ఆస్తమా వస్తుంది.దీనిని ఎక్సర్‌సైజ్ ఇండ్యూస్డ్ ఆస్తమా అంటారు. మరికొద్ది మందిలో దగ్గు తప్పించి ఇక ఏ ఇతర లక్షణాలు కనిపించవు.పల్మొనరీ ఫంక్షన్ టెస్ట్ (పి.యఫ్.టి.) వల్లనే వీరిలో ఆస్తమా వ్యాధిని నిర్ధారించవచ్చు.వీరికి కాఫ్ వేరియంట్ ఆస్తమా ఉన్నట్లుగా భావించాలి.అసిడిటీ, గ్యాస్ ప్రాబ్లమ్ ఉన్నవారిలో కూడా ఆస్తమా వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీరిలో మామూలు కంటే ఎక్కువ యాసిడ్ కడుపు నుండి గొంతులోకి వచ్చి శ్వాసనాళాల్లోకి ప్రవేశించటం మూలాన ఉబ్బసం వస్తుంది. పనుల ఒత్తిడి ఎక్కువగా ఉన్నవారికి లేదా మానసిక ఆందోళన, ఒత్తిడిలాంటి మానసిక సమస్యలు ఉన్నవారికి కూడా ఆస్తమా వస్తుంది. ఇలాంటి వారికి కేవలం ఆస్తమా మందులు సరిపోవు. ఆస్తమా మందులతో పాటు సైకియాట్రి జబ్బులకు ఇచ్చే మందులు వాడితేనే వీరికి ఉపశమనం కలుగుతుంది.
ఆస్తమా- చిన్నపిల్లలు
పుట్టిన వయస్సు నుండి ఏ వయస్సు వారికైనా ఈ వ్యాధి వస్తుంది. సాధారణంగా తల్లిదండ్రులు తమ పిల్లలకు ఈ వ్యాధి ఉన్నట్లు తెలిసి ఆందోళనకు గురవుతుంటారు. ఇలాంటి పిల్లల్లో తరచు జలుబు, దగ్గు, ఆయాసం వస్తుంటాయి. తోటి పిల్లల వలె పరుగెత్తలేకపోవటం లేదా మెట్లు ఎక్కుతున్నప్పుడు కాని ఆడుతున్నప్పుడు కానీ ఆయాసం వస్తుంటుంది. ఇలా తరచుగా తమ పిల్లలకు దగ్గు, ఆయాసం వస్తున్నప్పుడు వీరిలో టిబి వ్యాధి సోకిందేమోనన్న ఆనుమానం కూడా రాకమానదు. కాకపోతే టిబి వ్యాధి ఉన్నవారిలో దగ్గుతో పాటు జ్వరం రావటం, ఆకలి మందగించడం, సన్నబడటం, నీరసం, ఆటల్లో ఆసక్తి కనపరచకపోవటం కూడా ఉంటుంది.
ఇవే కాక ఎక్స్‌రేలో ప్రైమరీ కాంప్లెక్స్ అంటే లింఫ్ గ్రంథులు, న్యుమోనియా కనపడతాయి. ఆస్తమా ఉన్నవారిలో సా ధారణంగా ఎక్స్‌రే నార్మల్‌గా ఉంటుంది. కొంతమంది చిన్నపిల్లల్లో పాసి వ్ స్మొకింగ్ మూలాన కూడా ఆస్తమా తరచు వస్తూ ఉంటుంది. ఇంట్లోనే పొగతాగే వారి వల్ల చిన్నపిల్లలు ఇలాంటి వ్యాధులకు గురవుతారు. కొద్దిమంది తల్లిదండ్రులు తమకున్న ఆస్తమా తమ పిల్లలకు కూడా వస్తుందేమోనని ఆందోళన పడుతుంటారు. అయితే ఆస్తమా ఖచ్చితంగా పిల్లలకు వస్తుందని చెప్పలేం. వీరికి ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఎన్ని ఉన్నాయో, రాకపోయే అవకాశాలు కూడా అన్నే ఉన్నాయి. కాబట్టి ఈ విషయం గు రించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. నూటికి 90మంది పిల్లల్లో ఈ వ్యాధి 10 నుండి 12 సంవత్సరాలు వచ్చేసరికి దానంతట అదే తగ్గిపోతుంది. వ్యాధి పూర్తిగా తగ్గిపోయే వరకు మాత్రమే దానిని మందుతో అదుపులో ఉంచుకోవాలి.
ఆస్తమా- ఆహారం...
ఉబ్బస వ్యాధి ఉన్నవారు పాటించే ఆహార నియమాలు మరే ఇతర వ్యాధులున్న వారు కూడా పాటించకపోవచ్చు. దీనికి మనందరిలో ఉండే అపోహలే కారణం. ఆహారమే ప్రధానంగా ఉబ్బసం కలిగించడం చాలా అరుదు. 5 శాతం కంటే తక్కువమందిలో ఇది చూస్తాం.కొన్ని రకాల సిట్రస్ జాతికి చెందిన బత్తాయి, నిమ్మ వంటి పండ్లు, చేప లు, గుడ్డు తెల్లసొన, పాలు, చాక్లెట్లు, వేరుశనగలు కొందరికి పడవు. అ యితేచాలా మంది చాలా రకాల ఆహార పదార్ధాలను పథ్యం పాటిస్తా రు. ముఖ్యంగా తీపి, నూనె, పండ్లు, పులుపు, పెరుగు, టమాట తగ్గించట మో, మానేయడమో చేస్తుంటారు. అయితే వీరు ఇలా మానేసిన ఆహార పదార్ధాల వల్ల ఆస్తమా వస్తుందో లేదో అని పరీక్షించుకోవటం అవసరం.
పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఇలాంటి పదార్ధాలు తీసుకొని ఆస్తమా లక్షణాలు వస్తున్నాయో లేదో చూసుకోవాలి. ఒకటికి రెండుసార్లు అలాగ చూసుకొని వ్యాధి లక్షణాలు వస్తున్నాయి అనిపించినప్పుడు ఆ ఆహార పదార్ధాలు మానేస్తే మంచిది. సాధ్యమైనంత వరకు భయపడి ఆహార నియమాలు పాటించడం తగ్గించుకోవాలి. ముఖ్యంగా అన్ని రకాల పోష క పదార్ధాలు అవసరమయ్యే చిన్నపిల్లల్లో ఖచ్చితంగా రుజువయితే తప్పించి ఆయా ఆహార పదార్ధాలు మానేయాల్సిన అవసరం లేదు.
ఆస్తమా- చికిత్స...
గత ముపె్పై సంవత్సరాల్లో ఆస్తమాకి కొత్త కొత్త మందులు కనిపెట్టడమే కాకుండా, వీటిని శరీరంలోకి, నేరుగా శ్వాస నాళాల్లోకి పంపించటం ఉబ్బస వ్యాధి చికిత్సలో జరిగిన పరిణామాల్లో చెప్పుకోతగ్గవి. ఇలాంటి మందులను ఎయిరోసాల్స్ అంటారు. వీటి ద్వారా తక్కువ మందును వాడటమే కాకుండా వ్యాధి లక్షణాల నుండి త్వరితంగా ఉపశమనం కలిగేట్లు చేయవచ్చు. ఈ ఎయిరోసాల్స్‌లో వాడే మందు మోతాదు చాలా తక్కువ కాబట్టి మందుల వల్ల వచ్చే దుష్ర్పభావాలు కూడా అరుదు.ఈ మందులు రెండు రకాలు. ఇవి వ్యాధిని నివారించే మందులు- ప్రివెంటర్స్, ఉపశమనం ఇచ్చే మందులు - రిలీవర్స్.
బెక్లమెథసోన్, బ్యుడెసోనైడ్, ఫ్లుటికసోన్, సైక్లో సెనైడ్, మొమెటజోన్ మొదటి రకానికి చెందినవి.సాల్బ్యుటమాల్, టెర్బ్యుటలిన్, సాల్మెటరాల్, ఫార్మెటరాల్ రెండవ రకానికి చెందినవి. వ్యాధి లక్షణాలు కొద్దిగా ఉన్నప్పుడు ఉపశమనమిచ్చే మందులు ఎక్కువగా ఉన్నప్పుడు వీటితో పాటు నివారించే మందులను కొన్ని వారాలు వరుసగా వాడాలి. రుతువులలో మార్పు ఉబ్బస వ్యాధికి కారణం అవుతుంది.దీన్ని సీజనల్ ఆస్తమా అంటారు. ఆ రుతువు మొదలవటానికన్నా ఒకటి, రెండు వారాలు ముందే ఇవి మొదలుపెట్టి కొన్ని వారాలు క్రమంగా వాడాలి.
వ్యాధి అదుపులోకి వచ్చిన తరువాత మందు పరిమాణము కొద్ది కొద్దిగా తగ్గిస్తూ అతి తక్కువ డోస్‌తో వ్యాధి అదుపులో ఉండేటట్లు చూసుకోవాలి. ఒక్కోసారి వ్యాధి తీవ్రరూపం దాల్చినవారికి నెబ్యులైజర్ ద్వారా ఈ మందులను ఇవ్వవచ్చు. వీటితో తగ్గకపోతే అమెనోఫిల్లిన్, డాక్సోపైలిన్, డెరిఫిలిన్, టెర్బ్యుటలిన్, స్టెరాయిడ్స్ ఇంజక్షన్ రూపంలో వైద్యులు ఇస్తుంటారు. అయితే వీరి శరీరంలో ఉండే ప్రాణవాయువు తగ్గకుండా ఆక్సిజన్ కూడా ఇవ్వాలి. నోటి మాత్రలు, ఇంజక్షన్ల కంటే కూడా వ్యాధిని ఇన్‌హేలర్స్ వల్ల కంట్రోల్ చేసుకుంటే మంచిది. చిన్న పిల్లల్లో కూడా మందులు వాడవచ్చు. ఇన్‌హేలర్స్‌ను సరిగా వాడగలిగిన వారికి డ్రై పౌడర్ ఇన్‌హేలర్స్ లేదా మీటర్డ్ డోస్ ఇన్‌హేలర్స్ ను స్పేసర్ ద్వారా ఇవ్వవచ్చు.అత్యవసర పరిస్థితుల్లో ఈ మందులేవీ పని చేయనప్పుడు ఔషధాలు, మెగ్నీషియం సల్ఫేట్, అడినలిన్, హీలియాక్స్ వంటివి వాడవచ్చు.
No comments:
Post a Comment